Srikalahasti: శ్రీకాళహస్తిలో ఈనెల 9న ఇస్రో అంతరిక్ష అవగాహన సదస్సు
Srikalahasti: శ్రీహరికోట షార్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఆర్.పి.బి.ఎస్. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 9న ఇస్రో అంతరిక్ష అవగాహన సదస్సు, రాకెట్ నమూనాల ప్రదర్శన జరగనుంది.
Srikalahasti: శ్రీకాళహస్తిలో ఈనెల 9న ఇస్రో అంతరిక్ష అవగాహన సదస్సు
శ్రీకాళహస్తి: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా, విద్యార్థులకు అంతరిక్ష రంగం మరియు రాకెట్ ప్రయోగాలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 9వ తేదీన శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆర్.పి.బి.ఎస్. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఇస్రో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించనుంది.
ఈ కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం ఇస్రో శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. శాస్త్రవేత్తలు శ్రీనివాసరెడ్డి, మోహన్‌రావు, శ్రీనివాసరావు, మునీర్ తదితరులు పాఠశాలను సందర్శించి సదస్సు నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను, ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే అంతరిక్ష వారోత్సవాలను ఇస్రో ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల్లో ఘనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 9న శ్రీకాళహస్తిలో జరిగే ప్రదర్శనలో ఇస్రో రూపొందించిన వివిధ రాకెట్లు, అంతరిక్ష నమూనాలను (స్పేస్ మోడల్స్) నేరుగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.
పరిసర మండలాల నుంచి విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో హాజరై అంతరిక్ష విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ఇది భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఎంతో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.




