Srikalahasti: సుబ్రహ్మణ్యస్వామి కొండ ఆక్రమణ యత్నంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం
Srikalahasti: శ్రీకాళహస్తిలో కుమారస్వామి తిప్ప ఆక్రమణ యత్నంపై మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం. ఆలయ భూములను పరిరక్షించాలని డిమాండ్.
Srikalahasti: సుబ్రహ్మణ్యస్వామి కొండ ఆక్రమణ యత్నంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన విజ్ఞానగిరి (కుమారస్వామి తిప్ప)పై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి కొండను అక్రమంగా తవ్వి ఆక్రమించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం ఆయన దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని విజ్ఞానగిరి ప్రాంతాన్ని సందర్శించి, బ్రేకర్ యంత్రాలతో కొండను తవ్వుతున్నట్లు ఆరోపణలు ఎదురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం ఈవోకు వినతిపత్రం సమర్పించి, ఆలయ భూములను పరిరక్షించడంతో పాటు అక్రమ తవ్వకాలు, నిర్మాణాలకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. పవిత్రమైన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కుమారస్వామి కొండపై అక్రమ తవ్వకాలు, ఆక్రమణ యత్నాలు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. కొండను తవ్వుతున్న దృశ్యాలు బయటకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నించారు.
ఆలయ భూములు, ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులపై ఉందని పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలకు ఉపయోగించిన యంత్రాలను సీజ్ చేసి, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తాము ఎంతో శ్రమించి ఆరు ఇళ్లను ఖాళీ చేయించి వినాయక మండపం, పిల్లర్ నిర్మాణాలు పూర్తి చేశామని గుర్తుచేశారు.
హిందూత్వం, సనాతన ధర్మం గురించి మాట్లాడే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తిలో జరుగుతున్న ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని బియ్యపు మధుసూదన్‌రెడ్డి కోరారు. ఆలయ ఆస్తుల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే జిల్లా నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉత్తరాజీ శరవణ కుమార్, కంఠా ఉదయ్ కుమార్, మున్నా రాయల్, బుల్లెట్ జై శ్యామ్ రాయల్, శ్రీవారి సురేష్, తిరుమల చౌదరి, పీఎం చంద్ర, ముని కృష్ణారెడ్డి, సుమతమ్మ, కొట్టే శరవణ, జీవీకే రెడ్డి, గాదిపాకుల కిరణ్, మనీ, గుణ తదితరులు పాల్గొన్నారు.




