Srikalahasti: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి - ఎమ్మెల్యే బొజ్జల సుధీర్
Srikalahasti: శ్రీకాళహస్తిలో స్థానిక ఎన్నికలపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వారికి టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
Srikalahasti: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి - ఎమ్మెల్యే బొజ్జల సుధీర్
శ్రీకాళహస్తి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుపతి పార్లమెంట్ ఇన్‌చార్జి పనబాక లక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు.
రానున్న రెండు మూడు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కేసు కొట్టివేయబడిన వెంటనే మొదటి లేదా రెండో విడతలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు.
నోటిఫికేషన్ విడుదలైన సుమారు 15 రోజుల అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో గతంలో ఉన్న 35 వార్డులను 44 వార్డులకు పెంచామని, నూతన ఎస్‌ఐఆర్ ఓట్ల ప్రక్రియ ద్వారా 44 వార్డుల్లో సుమారు 73 వేల మంది ఓటర్లు నమోదయ్యారని తెలిపారు.
మరో రెండు రోజుల్లో కూటమికి చెందిన అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి, 44 వార్డుల్లో ఏ పార్టీ నుంచి ఎవరిని అభ్యర్థులుగా బరిలోకి దింపాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
పార్టీ మారిన వారికి టికెట్లు ఇవ్వబోం
2024 ఎన్నికల అనంతరం వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారికి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని సీనియర్ నాయకులతో కలిసి నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.
పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా స్వతంత్రంగా లేదా ఇతర విధానంలో పోటీకి దిగితే, వారికి వ్యతిరేకంగా టీడీపీ తరఫున ప్రత్యర్థి అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆయన హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.




