Tada: తడ: శ్రీసిటీ బాయిలర్ పేలుడు మృతుని ఇంటికి ఎమ్మెల్యే విజయశ్రీ

Tada: శ్రీ సిటీ సెజ్ టి.ఐ.ఎల్ హెల్త్‌కేర్‌లో బాయిలర్ పేలి కార్మికుడు వాసు మృతి చెందగా, ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 4 Oct 2026 9:34 PM IST
Tada
X

Tada: తడ: శ్రీసిటీ బాయిలర్ పేలుడు మృతుని ఇంటికి ఎమ్మెల్యే విజయశ్రీ

​తడ: శ్రీ సిటీ సెజ్‌లోని 'టి.ఐ.ఎల్ హెల్త్‌కేర్' (TIL Healthcare) పరిశ్రమలో చోటుచేసుకున్న ఘోర బాయిలర్ పేలుడు ప్రమాదంలో తిరుపతి జిల్లా తడ మండలం, తడకు చెందిన తన్నీరు వాసు అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత తీవ్ర విచారాన్ని కలిగించిందని సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.

​ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యేడా. నెలవల విజయశ్రీ, తడలోని మృతుని నివాసానికి స్వయంగా వెళ్లారు. అక్కడ శోకసంద్రంలో మునిగిపోయిన వాసు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఆత్మీయంగా ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్టసమయంలో వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కొండంత భరోసానిచ్చారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

​అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... అకాల మరణం పొందిన వాసు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ తీరని లోటును తట్టుకునే గుండె ధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కష్టపడి పనిచేసే సామాన్య కార్మికుడు ఈ విధంగా బలికావడం ఎంతో బాధాకరమన్నారు.

​బాధిత కుటుంబానికి పరిశ్రమ యాజమాన్యం నుంచి వెంటనే తగిన నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా, ప్రభుత్వం ద్వారా మృతుని కుటుంబానికి అన్ని విధాలా తగిన సహాయ సహకారాలు అందించి, ప్రతి విషయంలోనూ పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్పష్టమైన హామీ ఇచ్చారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta