Puttur: పుత్తూరు మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత!
Puttur: తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట భద్రత. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు సమీక్ష మరియు సామగ్రి పంపిణీ కేంద్రాల పరిశీలన.
Puttur: పుత్తూరు మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత!
Puttur: పుత్తూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు శనివారం ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
సున్నిత, అత్యంత సున్నిత, సాధారణ పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మొబైల్ పోలీస్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, రూట్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్స్, నాన్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సమస్యలు తలెత్తిన వెంటనే సంబంధిత బృందాలు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు.
అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు విధులు నిర్వహించాలని సూచించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిసేలా పోలీస్ శాఖ పూర్తి అప్రమత్తతతో పనిచేస్తుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు డీఎస్పీ రవికుమార్, ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




