Srikalahasti: శ్రీకాళహస్తిలో భద్రతా వైఫల్యం: పాదరక్షలతో భక్తురాలి ప్రవేశం
Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళా భక్తురాలు పాదరక్షలతో ఉంజల సేవ మండపం వరకు రావడం, శునకం ప్రవేశించడం కలకలం రేపింది.
Srikalahasti: శ్రీకాళహస్తిలో భద్రతా వైఫల్యం: పాదరక్షలతో భక్తురాలి ప్రవేశం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనానికి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలోకి భక్తులు నాలుగు గోపురాల ద్వారా ప్రవేశిస్తుండగా, ఆయా ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
అయితే ఓ మహిళా భక్తురాలు పాదరక్షలతోనే నాలుగో గోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశించి ఉంజల సేవ మండపం వరకు వచ్చిన ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న భక్తులు ఆమెను గమనించి పాదరక్షలు తొలగించుకోవాలని సూచించడంతో ఆమె వాటిని తీసివేశారు. దీంతో భద్రతా సిబ్బంది పర్యవేక్షణపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
అదే సమయంలో ఓ శునకం కూడా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి పొగడ చెట్టు వరకు వచ్చినట్లు భక్తులు తెలిపారు. ఒకేరోజు మహిళా భక్తురాలు పాదరక్షలతో ఆలయ అంతర్భాగం వరకు రావడం, శునకం ఆలయంలోకి ప్రవేశించడం వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో భద్రతా ఏర్పాట్లపై భక్తులు ప్రశ్నలు లేవనెత్తారు.
ఆలయ ఆచారాలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నాలుగు గోపురాల వద్ద పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు కోరారు.




