Renigunta: తుఫాన్ ప్రభావం విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి!

Renigunta: తుఫాన్ హెచ్చరికల వేళ విద్యుత్ భద్రతా జాగ్రత్తలను పాటించాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 16 Oct 2026 6:58 PM IST
Renigunta
X

Renigunta: తుఫాన్ ప్రభావం విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి!

రేణిగుంట: తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్లు, విద్యుత్ పరికరాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..

- తడిసిన విద్యుత్ స్తంభాలను, తడి చేతులతో స్విచ్ బోర్డులు, మోటార్లు, స్టార్టర్లు వంటి పరికరాలను తాకరాదు.

- విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తగిలినా, గాలివానలకు విద్యుత్ వైర్లు తెగిపడినా వాటిని ముట్టుకోరాదు. వెంటనే సంబంధిత లైన్‌మన్ లేదా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.

- పార్కులు, స్టేడియంలలోని విద్యుత్ స్తంభాలను తాకరాదు. చిన్నపిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి.

- బయట ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు నీటికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లలో ఉతికిన బట్టలను ఇనుప తీగలపై ఆరవేయరాదు.

- వాటర్ హీటర్‌ను ఆఫ్ చేసి, విద్యుత్ సరఫరాను సురక్షితంగా నిలిపిన తర్వాతే సంబంధిత పరికరాలను తాకాలి.

- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో డిష్ కనెక్షన్లు, టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్ వంటి పరికరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి.

- విద్యుత్ లైన్ల కింద నిలబడి సెల్‌ఫోన్ మాట్లాడటం, వర్షం సమయంలో విద్యుత్ పరికరాలను తాకడం వంటి పనులకు దూరంగా ఉండాలి.

- ఇంటికి వచ్చే సర్వీస్ వైరు దెబ్బతిన్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలి.

విద్యుత్ సంబంధిత సమస్యలు లేదా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే సంబంధిత JLM, ALM, LM, LI, సబ్‌స్టేషన్ లేదా అసిస్టెంట్ ఇంజినీర్ (AE)కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. విద్యుత్ సంబంధిత ఫిర్యాదుల కోసం 1912 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, విద్యుత్ భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలను నివారించుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA