Renigunta: డ్రై డే నిబంధనలకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా మద్యం విక్రయాలు
Renigunta: రేణిగుంట మండలం తూకివాకం పరిధిలో డ్రై డే నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు. అధికారుల ఉదాసీనతపై స్థానికుల ఆగ్రహం.
Renigunta: డ్రై డే నిబంధనలకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా మద్యం విక్రయాలు
రేణిగుంట: తూకివాకం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ‘డ్రై డే’ అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో మద్యం మాఫియాకు అవేమీ పట్టడం లేదు. రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ పరిధిలోని ఓ మద్యం దుకాణంలో నిబంధనలను బేఖాతరు చేస్తూ పక్కా దర్జాగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. డ్రై డే నిబంధనలను తుంగలో తొక్కి, వెనుక దొడ్డి దారుల్లో అధిక ధరలకు మద్యాన్ని యథేచ్ఛగా అమ్ముతున్నా సంబంధిత అధికారులు కిమ్మనకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ ఆశయాల మాట దేవుడెరుగు.. కనీసం ప్రభుత్వ ఆదేశాలను కూడా అమలు చేయలేని స్థితిలో ఎక్సైజ్ శాఖ నిద్రమత్తులో జోగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షాపు ముఖద్వారం మూసి ఉన్నట్లు భ్రమింపజేస్తూ, లోపల మాత్రం దందా జోరుగా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం ప్రియుల తాకిడితో దుకాణం పరిసరాలు కిటకిటలాడుతున్నా, అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున 'మామూళ్ల మత్తు' దాగి ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
కనీస బాధ్యత లేకుండా నిబంధనలను గాలికొదిలేసిన దుకాణ నిర్వాహకులపై, వారికి వత్తాసు పలుకుతున్న సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాలి. తూకివాకం పరిధిలో సాగుతున్న ఈ అక్రమ అమ్మకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన మద్యం వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




