Renigunta: కల్వర్టుపై మళ్లీ భారీ వాహనాల రాకపోకలు.. ఆందోళనలో స్థానికులు

Renigunta: రేణిగుంటలో కొత్తగా నిర్మించిన కల్వర్టుపై మళ్లీ భారీ వాహనాలు తిరుగుతుండటంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 1 Oct 2026 9:17 PM IST
Renigunta
X

Renigunta: కల్వర్టుపై మళ్లీ భారీ వాహనాల రాకపోకలు.. ఆందోళనలో స్థానికులు

రేణిగుంట: రేణిగుంట పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ వీధి–మిరియాల బాబా సర్కిల్‌ మార్గంలో భారీ వాహనాల రాకపోకలపై మళ్లీ స్థానికుల్లో ఆందోళన మొదలైంది. గతంలో ఇదే మార్గంలో భారీ వాహనాల రాకపోకలతో కల్వర్టు దెబ్బతిన్న ఘటనపై HMTVలో కథనం ప్రసారం కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నూతన కల్వర్టును ఏర్పాటు చేశారు. అయితే కొంతకాలం గడవకముందే అదే కల్వర్టుపై భారీ వాహనాలు తిరుగుతుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.

వ్యాపార అవసరాల పేరుతో భారీ వాహనాలు ఇరుకైన వీధుల్లోకి వచ్చి కల్వర్టుపై రాకపోకలు సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో కొత్తగా నిర్మించిన కల్వర్టు పరిస్థితి మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ భారీ వాహనాల రాకపోకలు ఎలా కొనసాగుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విద్యార్థుల భద్రతపై భయం

ఇదే మార్గంలో పాఠశాల పరిసర ప్రాంతం ఉండటంతో నిత్యం విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇరుకైన మార్గంలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారుల భద్రతకు ముప్పు వాటిల్లకముందే అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

ప్రమాదం జరిగాకే చర్యలా?

గత అనుభవం కళ్లముందే ఉన్నప్పటికీ మళ్లీ అదే పరిస్థితి పునరావృతం కావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు దెబ్బతిన్న తర్వాత మరమ్మతులు చేయడం కంటే.. ముందుగానే నిబంధనలు అమలు చేసి భారీ వాహనాలను నియంత్రించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అంటున్నారు.

ఈ మార్గంలో భారీ వాహనాలకు అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగానే రాకపోకలు సాగుతున్నాయా? అనే అంశాలను అధికారులు తక్షణమే పరిశీలించాలని కోరుతున్నారు. కొత్తగా నిర్మించిన కల్వర్టు మళ్లీ దెబ్బతినకుండా, విద్యార్థులు, స్థానికుల భద్రతకు భంగం కలగకుండా కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

“తూతూమంత్రంగా పర్యవేక్షణ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు.. ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కోవాలి” అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA