Renigunta: నులిపురుగుల నివారణతోనే ఆరోగ్యం: రేణిగుంటలో సదస్సు

Renigunta: సెప్టెంబర్ 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా రేణిగుంటలో 23,810 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 24 Sept 2026 4:51 PM IST
Renigunta
X

Renigunta: నులిపురుగుల నివారణతోనే ఆరోగ్యం: రేణిగుంటలో సదస్సు

రేణిగుంట: రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు, హెల్త్ సూపర్వైజర్ కామరాజు ఆధ్వర్యంలో తూకివాకం పంచాయతీ పరిధిలోని సంజీవరాయునిపట్టెడలో నులిపురుగుల నివారణ, కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ప్రజలకు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు విడివిడిగా అవగాహన కల్పించారు.

సెప్టెంబర్ 25న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించి నమిలి మింగించే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. రేణిగుంట మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని సుమారు 23,810 మంది చిన్నారులకు మాత్రలు అందించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 25న గైర్హాజరైన పిల్లలకు అక్టోబర్ 5న మాప్‌అప్ డే సందర్భంగా మాత్రలు అందిస్తామన్నారు.

నులిపురుగుల నివారణ, రక్తహీనత నియంత్రణతో పాటు చేతుల పరిశుభ్రత, ఆహారం తీసుకునే ముందు, మల విసర్జన అనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాంసాన్ని పూర్తిగా ఉడికించి తినడం, బహిరంగ మల విసర్జనకు దూరంగా ఉండటం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వీడియో ప్రదర్శన ద్వారా నులిపురుగుల వల్ల కలిగే అనర్థాలను వివరించారు.

అదేవిధంగా కుష్ఠు వ్యాధి లక్షణాలు, నివారణపై అవగాహన కల్పించారు. చర్మంపై స్పర్శలేని రాగిరంగు మచ్చలు, నొప్పిలేని పుండ్లు, కళ్లను పూర్తిగా మూయలేకపోవడం, కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని సూచించారు. కుష్ఠు వ్యాధి పాపం లేదా శాపం వల్ల రాదని, అపోహలను నమ్మవద్దని తెలిపారు.

వ్యాధి నిర్ధారణ అయితే ప్రభుత్వం ఉచితంగా బహుళ ఔషధ చికిత్స (MDT) అందిస్తుందని, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, అంగవైకల్యం ఉన్న వారికి MCR చెప్పులు కూడా ఉచితంగా అందిస్తామని వివరించారు. కుష్ఠు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారి గౌరవాన్ని కాపాడాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కామరాజు, హెడ్‌మాస్టర్ వెంకటరమణ బాబు, ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎం పద్మ, ఎంఎల్‌హెచ్‌పీ మేఘన, ఆశా కార్యకర్త గీతాంజలి, అంగన్వాడీ కార్యకర్త శంకరమ్మ, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA