Tirupati: తిరుపతిలో ఘనంగా నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Tirupati: తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అమరుల స్థూపానికి నివాళులర్పించిన కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 21 Oct 2026 12:53 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతిలో ఘనంగా నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Tirupati: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు వారి సేవలు ఆదర్శనీయం.

అమరవీరుల త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్. అమరవీరుల త్యాగస్ఫూర్తితో ప్రజలకు అంకితభావంతో సేవలందించడమే వారికి నిజమైన నివాళి: జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు.

ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం–2026 ను పురస్కరించుకుని బుధవారం తిరుపతి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడులు ముఖ్య అతిథులుగా పాల్గొని అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది అతిథులకు గౌరవ వందనం సమర్పించగా, పోలీసు అమరవీరుల గౌరవార్థం స్మృతి పరేడ్ నిర్వహించారు.

దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీసు అమరవీరుల వివరాలను జిల్లా అదనపు ఎస్పీ ఏ.శ్రీనివాసులు చదివి వినిపించారు. విధి నిర్వహణలో అసాంఘిక శక్తులతో పోరాడుతూ ప్రాణాలర్పించిన పోలీసు అధికారులు, సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL