Tirupati: తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు!

Tirupati: తిరుపతి జిల్లాలో 8 కౌంటింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా సాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు పరిశీలన.

K VENU, TIRUPATHI RURAL
Published on: 7 Nov 2026 12:28 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు!

Tirupati: తిరుపతి జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8 కౌంటింగ్ కేంద్రాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పరిశీలించారు. ఈ కేంద్రంలో చంద్రగిరి నియోజకవర్గాలతో పాటు నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు, వడమాలపేట మండలాలకు సంబంధించిన మొత్తం 8 మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ల వర్గీకరణ ప్రక్రియను దాదాపు అన్ని కేంద్రాల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 15 నుంచి 20 ఎంపీటీసీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిందని తెలిపారు.

జిల్లాలోని మొత్తం 302 ఎంపీటీసీ సెగ్మెంట్లకు సంబంధించిన ఫలితాలను మధ్యాహ్నం 2 గంటల కల్లా వెల్లడించేలా చర్యలు చేపట్టామని, 31 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన పూర్తి ఫలితాలను సాయంత్రం 6 గంటల కల్లా ప్రకటించే అవకాశం ఉందన్నారు.

జిల్లావ్యాప్తంగా మొత్తం 8 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో కలిసి ఇప్పటికే అన్ని కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా కౌంటింగ్ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL