Satyavedu: నారాయణవనంలో అట్టహాసంగా సైన్స్ ల్యాబ్‌ల ప్రారంభం!

Satyavedu: నారాయణవనం బాలికల ఉన్నత పాఠశాలలో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన సైన్స్ ల్యాబ్‌లను ప్రారంభించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, నేత కోనేటి సుమన్ కుమార్.

K. SURESH BABU, SATYAVEDU
Published on: 21 Sept 2026 7:48 PM IST
Satyavedu
X

Satyavedu: నారాయణవనంలో అట్టహాసంగా సైన్స్ ల్యాబ్‌ల ప్రారంభం!

సత్యవేడు: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు రూ.70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సైన్స్ ల్యాబ్స్‌ను సోమవారం ఉదయం సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు, సత్యవేడు నియోజకవర్గ టీడీపీ బీఎల్ఏ ఇన్‌చార్జ్ శ్రీ కోనేటి సుమన్ కుమార్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.

ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారికి, జడ్పీటీసీ సభ్యులు శ్రీ కోనేటి సుమన్ కుమార్ గారికి పాఠశాల యాజమాన్యం, గ్రామ ప్రజలు బాణసంచా కాల్చుతూ, మేళతాళాల మధ్య పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గారు రిబ్బన్ కట్ చేసి నూతన సైన్స్ ల్యాబ్స్‌ను ప్రారంభించి పరిశీలించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోహరి మాట్లాడుతూ, పాఠశాల అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం ఇంటర్మీడియట్ స్థాయికి ఎదిగిందని తెలిపారు. ఒకప్పుడు కొద్దిమంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాలలో ప్రస్తుతం సుమారు 480 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. పదో తరగతి అనంతరం ఇంటర్ విద్యను కూడా ఇక్కడే కొనసాగించే అవకాశం ఉండటంతో విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ బాలికల హాస్టల్, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేయడానికి సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే, జడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు శ్రీ కోనేటి సుమన్ కుమార్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల మరింత అభివృద్ధి చెందేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు మాట్లాడుతూ, విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం బాలికల ఉన్నత పాఠశాలకు మరింత ప్రభుత్వ సహాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. బాలికల హాస్టల్ మంజూరు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తానని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ నెట్ కేఫ్ చైర్మన్ ఆర్.డి. ఏకాంబరం, మాజీ వైస్ ఎంపీపీ టి. సుబ్రహ్మణ్యం, డిప్యూటీ డీఈఓ ఉమామహేశ్వరరావు, ఎంపీడీఓ అరుణ, తహసీల్దార్ భార్గవి, ఎంఈఓలు కోదండ నాయుడు, చంద్రశేఖర్ శెట్టి, మాజీ డిప్యూటీ ప్రభాకర్, స్థానిక నాయకులు మాణిక్యం రెడ్డి, బాలమురుగన్, అచ్చుకట్ల హరి, ఊరప్ప, పాఠశాల చైర్మన్ మోహన్ బాబు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

K. SURESH BABU, SATYAVEDU

K. SURESH BABU, SATYAVEDU