Sullurpeta: వర్షంలో తడుస్తూనే మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరణ!

Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో వర్షంలో తడుస్తూ చెత్త సేకరణ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది.. స్పందించని అధికారులపై ప్రజల ఆగ్రహం.

KKV Sudhakar, Sullurupeta
Published on: 17 Sept 2026 6:18 PM IST
Sullurpeta
X

Sullurpeta: వర్షంలో తడుస్తూనే మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరణ!

Sullurpeta: కుండపోత వర్షం, భయంకరమైనఉరుములు-మెరుపులు ఉసిగొల్పుతున్నా సరే.. ఆ పారిశుద్ధ్య కార్మికుల అంకితభావం ముందు వాతావరణం చిన్నబోయింది. తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని సాయి నగర్‌లో మున్సిపల్ సిబ్బంది ప్రదర్శించిన అసమాన విధి నిర్వహణ స్థానిక ప్రజలను ఎంతగానో కదిలించింది. వర్షం నీటిలో తడుస్తూనే ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడం చూసి, వారి శ్రమకు సాయి నగర్ నివాసితులు నీరాజనాలు పలికారు.

​అయితే, ఈ సంఘటన అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా ఎత్తిచూపింది. అత్యవసర పారిశుద్ధ్య సేవలు అందించే కార్మికులకు కనీసం తడవకుండా వేసుకునే రెయిన్ కోట్లు గానీ, గమ్ బూట్లు గానీ కేటాయించకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ పరికరాలు లేకపోయినా, వర్షంలో పూర్తిగా తడుస్తూనే ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించాల్సిన దుస్థితి దాపురించింది.

​"సాధారణంగా ఇలాంటి భయంకర వాతావరణంలో బయటకు రావడానికే భయపడతాం. అలాంటిది శరీరానికి కనీస రక్షణ లేకపోయినా ప్రజల ఆరోగ్యం కోసం కార్మికులు పడుతున్న శ్రమ వర్ణనాతీతం. ఇంతటి వానలో ఇలా డ్యూటీ చేయడం అందరికీ సాధ్యం కాదు" అంటూ స్థానికులు వారి సేవలను కొనియాడారు. ​సిబ్బంది చూపిన ఈ నిబద్ధతకు సాయి నగర్ ప్రజలు అభినందనలు తెలియజేస్తూనే, అధికారుల తీరుపై ప్రశ్నలు గుప్పించారు.

రోజూ సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికుల ఆరోగ్యాన్ని, భద్రతను విస్మరించడం సరికాదని హితవు పలికారు. తక్షణమే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, వర్షాకాలంలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి నాణ్యమైన రెయిన్ కోట్లు, సేఫ్టీ గేర్లను అందజేయాలని డిమాండ్ చేశారు. నిబద్ధతతో పనిచేస్తున్న సిబ్బందిని ప్రోత్సహిస్తూనే, వారి ప్రాథమిక హక్కులను నెరవేర్చాలని కోరారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta