Tirupati: తిరుపతి జిల్లాలో ఘనంగా పాసుపుస్తకాల పంపిణీ!
Tirupati: వెంకటపురం ఆర్.అగ్రహారంలో రీ-సర్వే పూర్తి చేసి అర్హులైన రైతులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, తహసీల్దార్ కొత్త పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.
Tirupati: తిరుపతి జిల్లాలో ఘనంగా పాసుపుస్తకాల పంపిణీ!
Tirupati: రీ-సర్వే పూర్తయిన వెంకటపురం పంచాయతీ ఆర్.అగ్రహారం గ్రామంలో భూ రికార్డుల్లో ఉన్న తప్పులను సరిచేసి, అర్హులైన పట్టాదారులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, తహసీల్దార్ (ఎమ్మార్వో) శ్రావణ్‌కుమార్ గురువారం పంపిణీ చేశారు.
కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు ఎంపీడీవో రవిచంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల అధికారులు ఘన స్వాగతం పలికారు. తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి ఎమ్మెల్యేను ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రీ-సర్వే ద్వారా భూముల వివరాలను పక్కాగా నమోదు చేసి, రికార్డుల్లోని లోపాలను సరిచేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో వ్యక్తుల ఫొటోలతో ముద్రించిన పాసుపుస్తకాలను రద్దు చేసి, ముఖ్యమంత్రి ఫొటో లేకుండా రాజముద్రతో కూడిన ప్రభుత్వ పాసుపుస్తకాలను మళ్లీ పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళనతో అర్హులైన రైతులకు తమ భూములపై స్పష్టమైన హక్కులు, రికార్డుల విషయంలో మరింత భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల సంక్షేమం, గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు నచ్చితేనే ఓటు వేయాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు. అర్హులైన ప్రతి పట్టాదారుడికి సకాలంలో పాసుపుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.




