Srikalahasti: ఎంజీఎం గ్రూప్ కుటుంబాన్ని కలిసిన మంత్రి పెందుర్తి వెంకటేష్
Srikalahasti: శ్రీకాళహస్తిలో ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ల నివాసానికి విచ్చేసిన మంత్రి పెందుర్తి వెంకటేష్ దంపతులు, నిర్మాణంలో ఉన్న సీబీఎస్ఈ పాఠశాల పనులను పరిశీలించారు.
Srikalahasti: ఎంజీఎం గ్రూప్ కుటుంబాన్ని కలిసిన మంత్రి పెందుర్తి వెంకటేష్
శ్రీకాళహస్తి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాల నిర్వహణ శాఖా మంత్రి, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, ఆయన సతీమణి పెందుర్తి అన్నపూర్ణలు శ్రీకాళహస్తిలోని MGM గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్, గుడ్లూరు ఐశ్వర్య లక్ష్మి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు ఆతిథ్యాన్ని స్వీకరించారు.
పెందుర్తి వెంకటేష్ గారు గుడ్లూరు ఐశ్వర్య లక్ష్మికి స్వయానా చిన్నాన్న కావడంతో కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడిపారు. MGM గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున నాయుడు వారికి స్వాగతం పలికారు.
అనంతరం శ్రీకాళహస్తిలో MGM గ్రూప్ నిర్మిస్తున్న CBSE పాఠశాల నిర్మాణ పనులను మంత్రి పెందుర్తి వెంకటేష్ సందర్శించారు. పాఠశాల నిర్మాణం, విద్యా సదుపాయాలపై వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అభివృద్ధికి కేంద్రంగా మారుతోందన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారని తెలిపారు. నందమూరి తారక రామారావు తీసుకొచ్చిన తెలుగుగంగ ప్రాజెక్టు కారణంగా వ్యవసాయ రంగంతో పాటు విద్యా, పారిశ్రామిక, ఆధ్యాత్మిక రంగాల్లోనూ శ్రీకాళహస్తి అభివృద్ధి చెందుతోందన్నారు.
శ్రీకాళహస్తిలో MGM గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. విద్యా రంగంలో CBSE పాఠశాల నిర్మాణం వంటి కార్యక్రమాలు ప్రాంత అభివృద్ధికి మరింత దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో MGM గ్రూప్ కుటుంబ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




