Srikalahasti: శ్రీకాళహస్తిలో జనసేన బలోపేతానికి కృషి చేస్తాం మిద్దెల హరి, ప్రవీణ్
Srikalahasti: శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపిన మిద్దెల హరి, సత్రవాడ ప్రవీణ్. త్వరలో పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి పర్యటన.
Srikalahasti: శ్రీకాళహస్తిలో జనసేన బలోపేతానికి కృషి చేస్తాం మిద్దెల హరి, ప్రవీణ్
శ్రీకాళహస్తి: జనసేన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని జనసేన నియోజకవర్గ నేత మిద్దెల హరి తెలిపారు. సోమవారం సత్రవాడ ప్రవీణ్‌తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, పార్టీ లక్ష్యాలు నచ్చి తాము స్వచ్ఛందంగా జనసేనలో చేరినట్లు మిద్దెల హరి తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కూటమి నాయకుల సహకారంతో రానున్న ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బలాన్ని నిరూపించేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను విస్తరిస్తామని తెలిపారు. తమ వెంట నడుస్తున్న కార్యకర్తలను ఎవరైనా రాజకీయంగా ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
త్వరలో జనసేనాని పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తిలో బహిరంగ సభ నిర్వహించనున్నారని, ఆ సందర్భంగా వైసీపీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరే అవకాశం ఉందని మిద్దెల హరి పేర్కొన్నారు. ప్రశ్నించే తత్వం, అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం అందించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని, ఆయన బాటలో తామూ పనిచేస్తామని అన్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే ముని రమణయ్య కుమారుడు సత్రవాడ ప్రవీణ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల కోసం జనసేన పార్టీ సైనికుడిగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జనసేన బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
అంతకుముందు మిద్దెల హరి, సత్రవాడ ప్రవీణ్ శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం నగిరి వీధిలోని మిద్దెల హరి యువసేన కార్యాలయానికి చేరుకోగా అభిమానులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జయదేవన్ గిరి, తిరుపతి పార్లమెంటు జనసేన పార్టీ పరిశీలకులు తమ్మినేని వెంకటేశ్వర్లు, కె.వి. రమణ, గంజి వెంకటేష్, బండి రమేష్, ఈగ హరి, కరుణాకర్, పాలసెట్టి నరసింహులు, బొజ్జ ప్రభాకర్, ధావాల గిరి, చల్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.




