Kota: సాగునీటి సమస్య పరిష్కరించాలని రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకున్న రైతులు

Kota: ఉత్తమనెల్లూరులో సాగునీటి సమస్య పరిష్కరించకుండా గూడూరు-తూపిలిపాళెం రోడ్డు పనులు చేపడితే కలెక్టరేట్ ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Oct 2026 8:15 PM IST
Kota
X

Kota: సాగునీటి సమస్య పరిష్కరించాలని రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకున్న రైతులు

కోట: ఎత్తైన తూముల కారణంగా సాగునీరు సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నాయని, పదేళ్లుగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కారం లభించడం లేదని కోట మండలం ఉత్తమనెల్లూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 350 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకోకుండా గూడూరు–తూపిలిపాళెం మధ్య రూ.16.50 కోట్లతో చేపడుతున్న డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. ముందుగా పాత తూముల స్థానంలో నూతన కల్వర్టు నిర్మించి, సాగునీటి సమస్యను పరిష్కరించిన తర్వాతే రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం నిర్మాణ పనులను అడ్డుకున్నారు. కల్వర్టు నిర్మించకుండా రోడ్డు పనులు కొనసాగిస్తే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

కోట మండలంలోని స్వర్ణముఖి చల్లకాలువ నుంచి తిమ్మనాయుడుపాళెం రైస్‌ మిల్లు సమీపంలో ఉన్న తూముల ద్వారా ఉత్తమనెల్లూరు చెరువుకు సాగునీరు చేరుతుంది. అయితే సుమారు పదేళ్ల క్రితం నిర్మించిన ఈ తూములు ఎక్కువ ఎత్తులో ఉండటంతో నీరు సక్రమంగా ప్రవహించడం లేదని రైతులు తెలిపారు. దీంతో చెరువు ఆయకట్టుకు తగినంత నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి ఒకే పంట సాగు చేసుకునే తమకు నీటి కొరత తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

గూడూరు–తూపిలిపాళెం మధ్య రూ.16.50 కోట్లతో చేపడుతున్న డబుల్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా తూముల ప్రాంతంలో కంకర తోలి శుక్రవారం పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఉత్తమనెల్లూరు రైతులు మాజీ సర్పంచి, చెరువు ఆయకట్టు సంఘం అధ్యక్షుడు జంగిట కిష్టయ్య ఆధ్వర్యంలో అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. సాగునీటి ప్రవాహానికి అనుగుణంగా లేని పాత తూములను తొలగించి, నీరు సక్రమంగా వెళ్లేలా నూతన కల్వర్టు నిర్మించాలని స్పష్టం చేశారు. కల్వర్టు నిర్మాణం చేపట్టకుండా రోడ్డు వేస్తే భవిష్యత్తులోనూ సాగునీటి సమస్య కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉత్తమనెల్లూరు చెరువుకు చేరే నీరు అక్కడి నుంచి చీలిక కాలువ ద్వారా జమ్మలమిట్ట చెరువుకు కూడా చేరుతుందని రైతులు తెలిపారు. దీంతో రెండు చెరువుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందడంలో ఈ తూములు కీలకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ తూములను తొలగించి నూతన కల్వర్టు నిర్మిస్తే రెండు చెరువుల పరిధిలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కల్వర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తమ సాగునీటి సమస్యను పరిష్కరించకుండా రోడ్డు పనులు కొనసాగిస్తే రైతులందరితో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని సన్న, చిన్న కారు రైతులు హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్