Tirupati: తిరుపతి మున్సిపల్ ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ!
Tirupati: తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి శిక్షణ. ఈసీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జేసీ గోవిందరావు, కమిషనర్ జయకృష్ణ ఆదేశం!
Tirupati: తిరుపతి మున్సిపల్ ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ!
Tirupati: మున్సిపల్ సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా ఈ నెల 28న నిర్వహించనున్న పోలింగ్ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు ఖచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు మరియు మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణ సూచించారు.
పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్ బాక్సుల వినియోగంపై ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి బుధవారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
పోలింగ్ సిబ్బంది తమ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.
ప్రిసైడింగ్ అధికారులు తప్పనిసరిగా పి.ఓ. డైరీని వినియోగించాలని, ఎన్నికల విధులకు సంబంధించిన హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా చదివి అందులోని నిబంధనలు, విధివిధానాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని పేర్కొన్నారు.
శిక్షణ కార్యక్రమంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల విధులు, ఎన్నికల నియమావళి అమలు, ఓటర్లకు అవసరమైన సౌకర్యాల కల్పన, ఎన్నికల సామగ్రి నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
బ్యాలెట్ బాక్సుల వినియోగం, పోలింగ్ ప్రారంభానికి ముందు నిర్వహించాల్సిన తనిఖీలు, బ్యాలెట్ బాక్సుల సీలింగ్ ప్రక్రియ, వాటి భద్రత, రవాణా, పోలింగ్ ముగిసిన అనంతరం బాక్సులను సంబంధిత అధికారులకు అప్పగించే విధానాలను వివరించారు. ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన ప్రతి విధానాన్ని నిబంధనల ప్రకారం అమలు చేయాలని సూచించారు.
పోలింగ్ సిబ్బంది విధుల నిర్వహణలో పూర్తి బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.




