Sullurpeta: జీవోల ఆర్భాటం తప్ప.. నిధుల కేటాయింపు శూన్యం!

Sullurpeta: సూళ్ళూరుపేటలో వైకాపా డ్రామాలను ఎండగట్టిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. టెక్నికల్ శాంక్షన్ లేకుండానే అబద్ధపు శంకుస్థాపనలు చేశారని విమర్శ.

KKV Sudhakar, Sullurupeta
Published on: 17 Sept 2026 7:27 AM IST
Sullurpeta
X

Sullurpeta: జీవోల ఆర్భాటం తప్ప.. నిధుల కేటాయింపు శూన్యం!

Sullurpeta: ​తిరుపతిజిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల పేరిట ప్రచార ఆర్భాటాలు చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో నిధులు తీసుకురావడంలో గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తండ్రి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య ప్రసంగం చేస్తూ, గత ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, నిధుల మంజూరులో జరిగిన మోసాలను ఎండగట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడటం తగదని హితవు పలికారు.

నాయుడుపేటలో ఒకసారి, సూళ్ళూరుపేటలో మరొకసారి వరుసగా ప్రెస్ మీట్‌లు ఏర్పాటు చేసి గొప్పలు చెప్పుకోవడం కాదని, అసలు అభివృద్ధి పనులకు తెచ్చిన నిధులెంతో, వాటి వాస్తవ పరిస్థితి ఏమిటో ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

​గత వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య కాలంలో జరిగిన ప్రచారాలను ఈ సందర్భంగా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు. శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయం పక్కన రూ.35 కోట్లతో ఆర్‌ అండ్ బి (R&B) బ్రిడ్జి నిర్మాణానికి నవంబరు నెలలో కేవలం ఒక జీవో (G.O.) మాత్రమే తీసుకొచ్చారని స్పష్టం చేశారు. కేవలం జీవో రాగానే పనులు మొత్తం పూర్తయినట్లు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు.

జీవో అనేది కేవలం పరిపాలనా అనుమతి (Administrative Sanction) మాత్రమేనని, దానికి ఆర్థిక శాఖ అనుమతి (Financial Concurrence) లభించిన తర్వాతే ఆర్ అండ్ బి శాఖాపరంగా టెక్నికల్ శాంక్షన్ (సాంకేతిక అనుమతి) ఇస్తుందని క్లియర్‌గా వివరించారు. టెక్నికల్ శాంక్షన్ లభించకుండా టెండర్లు పిలవడం గానీ, పనులు ప్రారంభించడం గానీ చట్టపరంగా జరగవని స్పష్టం చేశారు.

సంబంధిత ఆర్‌ అండ్ బి అధికారులను, డీఈని స్వయంగా విచారించగా తమ వద్దకు అప్పట్లో ఎలాంటి జీవో ప్రతి రాలేదని వారు తేల్చిచెప్పారని వెల్లడించారు. ఆర్థిక శాఖ ఆమోదం లేని ఇటువంటి కాగితపు జీవోలతో శంకుస్థాపన రాళ్లు వేసి, టెంకాయలు కొట్టి చప్పట్లతో వైకాపా నాయకులు ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేశారని దుయ్యబట్టారు.

​అంతేకాకుండా, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడి గతంలో మంజూరైన పనులను రద్దు చేయించిందని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆరోపించారు. నాయుడుపేట మండల పరిధిలోని చిగురుపాడు రోడ్డు నిర్మాణానికి ఎస్టీ నిధుల నుంచి రూ.1.80 కోట్లు తెప్పించి, టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తే... పనులు ప్రారంభించలేదనే నెపంతో ఆనాటి వైకాపా ఎమ్మెల్యే జీవోను రద్దు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా భీమవరం స్మశానవాటిక రోడ్డు నిర్మాణం కోసం కేటాయించిన రూ.70 లక్షల నిధులను కూడా రద్దు చేయించారని గుర్తుచేశారు. గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన సమయాల్లో ఎన్నడూ లేని విధంగా, కేవలం 25 శాతం పనులు పూర్తి కాలేదనే ఆంక్షల సాకుతో అభివృద్ధి పనులను అడ్డుకున్నారని విమర్శించారు.

​ఇలాంటి హడావుడి శంకుస్థాపనలకు స్వస్తి పలుకుతూ, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుత సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ స్వయంగా చొరవ తీసుకున్నారని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం వెల్లడించారు.

గతంలో నిలిచిపోయిన అదే చిగురుపాడు రోడ్డుకు రూ.1.90 కోట్లు మంజూరు చేయించి, రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయించారని, ఆమె చేతుల మీదుగానే ప్రారంభోత్సవం కూడా జరిగిందని తెలిపారు. కంటితుడుపు శంకుస్థాపనలకు, నిజమైన అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను ప్రజలు స్వయంగా గమనిస్తున్నారని స్పష్టం చేశారు.

​అలాగే సూళ్ళూరుపేట నియోజకవర్గ సాగు, తాగునీటి కష్టాలను తీర్చేందుకు 2004 నుంచి తాము నిరంతరం పోరాటం చేస్తున్నామని గుర్తుచేశారు. శాసనసభలో జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయంలో పలుమార్లు గళమెత్తి అధికారులపై ఒత్తిడి తెచ్చి కాళంగి నదికి, స్వర్ణముఖి నదికి రెండు టీఎంసీల తెలుగుగంగ నీటిని సాధించుకోగలిగామని వివరించారు.

నేడు మనం అడగకుండానే తెలుగుగంగ అధికారులు మ్యాండేట్‌గా నీటిని విడుదల చేస్తున్నారంటే అది తమ నిరంతర శ్రమ, పోరాట ఫలితమేనని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

​ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, సూళ్ళూరుపేట ఏఎంసీ (AMC) చైర్మన్ ఆకుతోట రమేష్, శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, సూళ్ళూరుపేట టీడీపీ మండల అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, టీడీపీ సీనియర్ నాయకుడు మాధవ్ నాయుడు, టీడీపీ యువత నాయకుడు వెంకీ యాదవ్‌లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta