Sullurpeta: సూళ్ళూరుపేట ప్రగతి: రూ.20 కోట్ల పనులను ప్రారంభించిన సీఎం

Sullurpeta: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా సూళ్ళూరుపేట పురపాలక సంఘానికి రూ.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 22 Sept 2026 7:05 PM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్ళూరుపేట ప్రగతి: రూ.20 కోట్ల పనులను ప్రారంభించిన సీఎం

సూళ్ళూరుపేట: ​తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పురపాలక సంఘం పరిధిలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం చుడుతూ ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ (HAM) ద్వారా చేపడుతున్న కార్యక్రమం నూతన అధ్యాయానికి నాంది పలికింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధికి ₹11,360 కోట్లను ప్రారంభించారు. ఇందులో భాగంగా సూళ్లూరుపేట పురపాలక సంఘానికి ₹20 కోట్ల నిధులు మంజూరయ్యాయి.​

ఈ కార్యక్రమాన్ని సూళ్ళూరుపేట లోని షార్ రోడ్డులో ఉన్న శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో ప్రత్యక్ష ప్రసారం (లైవ్) ద్వారా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సూళ్ళూరుపేట స్పెషల్ ఆఫీసర్ కె. దేవేంద్ర రెడ్డి అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ కె. చిన్నయ్య ఆధ్వర్యంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, నియోజకవర్గ సమగ్ర వికాసానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సూళ్లూరుపేట పురపాలక పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను, సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. రాబోయే రోజుల్లో పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

​పట్టణ పరిధిలో పారిశుధ్యం, రోడ్లు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనలో మున్సిపల్ అధికారులు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ కె. చిన్నయ్య పనితీరును, వారి నాయకత్వంలో జరుగుతున్న ప్రగతి పనులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా కొనియాడారు. మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య కృషి, పాలనా నైపుణ్యం అందరికీ ఆదర్శంగా నిలిచి మరింత గుర్తింపు పొందాలని ఆమె ఆకాంక్షించారు.

​కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ₹20 కోట్ల మంజూరుతో సూళ్ళూరుపేట రూపురేఖలు మారనున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta