Renigunta: రేణిగుంట ఆలయ వివాదంపై భూమనకు మంత్రి ఆనం కౌంటర్
Renigunta: రేణిగుంట అంజనేయపురం ఆలయంపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఖండన; రూ.59.30 లక్షల పరిహారం వివరాలు.
Renigunta: రేణిగుంట ఆలయ వివాదంపై భూమనకు మంత్రి ఆనం కౌంటర్
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అంజనేయపురం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి వైసీపీ నాయకులు, ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశంపై స్పందించిన మంత్రి.. వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ దేవాలయాలను వివాదాల్లోకి లాగడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ:
ఆలయ చరిత్రపై కూడా అబద్ధాలా?
రేణిగుంట అంజనేయపురంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖ అధికారుల నివేదిక ప్రకారం గ్రామస్తులు సుమారు 70 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాంటి ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని, పురాతన ఆలయాన్ని కూల్చివేశారని ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవం. అధికారిక రికార్డులు ఒకలా ఉంటే, రాజకీయ స్వార్థం కోసం చరిత్రను వక్రీకరించి మాట్లాడటం భూమన కరుణాకర్ రెడ్డికి తగదు. మాజీ టీటీడీ చైర్మన్ హోదాలో పనిచేసిన వ్యక్తి ఆలయాల విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలి. కనీసం వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను.
ఆలయ పరిహారం విషయంలో పారదర్శకత ఉంది.. దమ్ముంటే ఆధారాలతో మాట్లాడాలి!:
NH-716 జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించే ప్రక్రియలో భాగంగా 2023లోనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. 20-10-2023న భూసేకరణ అవార్డు జారీ చేశారు. ఆలయానికి సంబంధించిన సుమారు 10 సెంట్ల భూమి సేకరణకు పరిహారంగా రూ.59,30,606 మంజూరయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన ఆ మొత్తాన్ని ఆలయ ఈవో ఖాతాలో జమ చేసి, అనంతరం ఆలయం పేరుతోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలకు నిధులను మళ్లించలేదు. ఆలయానికి రావాల్సిన ప్రతి రూపాయి ఆలయ ప్రయోజనాల కోసమే భద్రపరిచాం. అయినా నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపణలు చేయడం పూర్తిగా నిరాధారం.
ఆగమ శాస్త్ర సంప్రదాయాలను పాటించిన తర్వాతే ఆలయ తొలగింపు ప్రక్రియ చేపట్టాం.:
ఆలయాన్ని తొలగించే ముందు అర్చకులు, దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాం. ముందుగా బాలాలయం ఏర్పాటు చేసి, మూలవిరాట్ను శాస్త్రోక్తంగా తరలించి ధాన్యాధివాసంలో భద్రపరిచాం. అనంతరం పక్కనే ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణంలో ప్రతిష్ఠించాం. విగ్రహాల విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. భక్తుల మనోభావాలు, వైదిక సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి చర్య తీసుకున్నాం. ఈ విషయాలను తెలుసుకోకుండా దేవాదాయ శాఖపై బురదజల్లడం సరికాదు.
ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.:
భూసేకరణ అనంతరం మిగిలిన స్థలంలో ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు చేపడుతున్నాం. అంతేకాకుండా పక్కనే కొత్త ఆలయ నిర్మాణానికి అవసరమైన 50 సెంట్ల స్థలాన్ని కూడా కేటాయించాం. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. మా ప్రభుత్వానికి ఆలయాలను కూల్చాలనే ఉద్దేశం లేదు. అభివృద్ధి పనులతో పాటు ఆలయాల పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నాం.
అంతర్వేది రథం దగ్ధమైనప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది?
ఈ రోజు ఆలయాల పరిరక్షణ గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులు తమ ఐదేళ్ల పాలనలో జరిగిన ఘటనలకు ముందుగా సమాధానం చెప్పాలి. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్ధమైనప్పుడు, విజయవాడ కనకదుర్గమ్మ వారి అమ్మవారి వెండి సింహాలు మాయమైనప్పుడు ఎటు పోయింది మీ ప్రభుత్వం, అలాగే పవిత్ర రామతీర్థంలో శ్రీరాముని శిరచ్ఛేదనం చేసిన రోజు ఏమైపోయారు.... అప్పుడు మీ ప్రభుత్వం ఏం చేసింది? రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దేవతా విగ్రహాలు ధ్వంసమైనప్పుడు తీసుకున్న చర్యలేంటి? ఆలయాలపై దాడులు జరిగినప్పుడు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? హిందూ ధార్మిక సంస్థలు, భక్తుల మనోభావాల పరిరక్షణ విషయంలో అప్పటి ప్రభుత్వ చిత్తశుద్ధి ఎక్కడుంది?
ఐదేళ్ల పాలనలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పకుండా, ఇప్పుడు ఆలయాల పేరుతో రాజకీయ విమర్శలు చేయడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. భూమన కరుణాకర్ రెడ్డి గారు ముందుగా మీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై ప్రజలకు సమాధానం చెప్పండి. ఆ తర్వాతే ఇతరులపై విమర్శలు చేయండి.
కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది.:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం హిందూ ధర్మ పరిరక్షణకు, దేవాలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ధూపదీప నైవేద్య పథకం ద్వారా చిన్న ఆలయాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం. కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఆలయాల నిర్మాణం, జీర్ణోద్ధరణకు నిధులు కేటాయిస్తున్నాం. అర్చకుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల్లో భజన మందిరాల నిర్మాణం, ఆలయాల డిజిటలైజేషన్, భక్తులకు మెరుగైన దర్శన, వసతి, ప్రసాద సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
ఇవన్నీ క్షేత్రస్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలు. మా ప్రభుత్వానికి హిందూ ధర్మ పరిరక్షణ అనేది రాజకీయ నినాదం కాదు.. నిబద్ధత.
భక్తుల విశ్వాసాలతో రాజకీయాలు చేయొద్దు!:
దేవాలయాలు రాజకీయ వేదికలు కావు. అవి కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకలు. ఒకవైపు ఆలయాల గురించి మాట్లాడుతూనే మరోవైపు తప్పుడు ప్రచారాలతో భక్తుల మనోభావాలను రెచ్చగొట్టడం బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుల లక్షణం కాదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై వ్యక్తిగత రాజకీయ విమర్శలు చేయడం, ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని వివాదాస్పదం చేయాలని చూడటం వైసీపీ రాజకీయ అసహనానికి నిదర్శనం. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణలు చేసే ముందు అధికారిక రికార్డులు పరిశీలించాలి. ఆధారాలతో మాట్లాడాలి. రాజకీయ ఉనికి కోసం దేవాలయాలను వివాదాల్లోకి లాగవద్దు.
భూమన కరుణాకర్ రెడ్డికి రాజకీయ ఉనికి కోసమే ఆలయాల అంశం గుర్తుకొస్తోందా? భూమన కరుణాకర్ రెడ్డి మీరు మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించిన బాధ్యతలు నిర్వహించిన మీరు దేవాలయాల విషయంలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తూ మీరు ఆలయాల పరిరక్షణ కంటే రాజకీయ విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి చిన్న అంశాన్ని వివాదంగా మార్చి, భక్తుల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు.
మీకు నిజంగా ఆలయాలపై అంతటి ప్రేమ, భక్తి ఉంటే మీ హయాంలో జరిగిన ఘటనలపై కూడా ఇదే స్థాయిలో మాట్లాడాలి. మీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ప్రశ్నించే ధైర్యం లేకుండా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మీ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది.
వైసీపీకి హిందూ ధర్మంపై మాట్లాడే నైతిక అర్హత ఉందా?:
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆలయాలపై జరిగిన ఘటనలు, భక్తుల్లో నెలకొన్న ఆందోళనలు ప్రజలు ఇంకా మరిచిపోలేదు. అంతర్వేది రథం దగ్ధం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాల మాయంపై వివాదం, రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం వంటి ఘటనలపై అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆ ఘటనలపై సమగ్రంగా సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఆలయాల పేరుతో రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదం.
హిందూ ధర్మం, ఆలయాల పవిత్రత, భక్తుల విశ్వాసాల గురించి మాట్లాడటం అంత సులభం కాదు. వాటిని కాపాడే బాధ్యత, చిత్తశుద్ధి కూడా ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా మాట్లాడటం వైసీపీ నాయకులకు అలవాటుగా మారింది.
ఆలయాల అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ రాజకీయమా?: జాతీయ రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి ప్రజాప్రయోజన పనులు చేపట్టినప్పుడు సంబంధిత నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆలయాల పరిరక్షణకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఈ రెండు అంశాలను సమన్వయం చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. ఆలయానికి పరిహారం చెల్లించి, ఆ నిధులను ఆలయం పేరుతోనే భద్రపరిచి, తిరిగి ఆలయ నిర్మాణానికి 50 సెంట్ల స్థలాన్ని కేటాయించిన విషయాలు కళ్లముందే ఉన్నాయి. అయినా అభివృద్ధి పనులను అడ్డుకునేలా, ప్రభుత్వంపై బురదజల్లేలా తప్పుడు ప్రచారం చేయడం వైసీపీ రాజకీయాలకు పరాకాష్ట.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తే వాస్తవాలు బయటపెడతాం!
భూమన కరుణాకర్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాను. రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే చేయండి. కానీ దేవాలయాల చరిత్రను వక్రీకరించవద్దు. ఆలయ నిధుల విషయంలో నిరాధార ఆరోపణలు చేయవద్దు. భక్తుల విశ్వాసాలను రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవద్దు. ప్రతి ఆరోపణకు మా దగ్గర అధికారిక రికార్డులు, ఆధారాలు ఉన్నాయి. ప్రజల ముందు వాస్తవాలను ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటే వైసీపీ నాయకుల ప్రయత్నాలను ప్రజలే తిప్పికొడతారు. దేవాలయాల పవిత్రతను కాపాడటం, హిందూ ధర్మ సంప్రదాయాలను పరిరక్షించడం, ఆలయాల అభివృద్ధికి కృషి చేయడం మా ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నుంచి మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.
మా ప్రభుత్వ లక్ష్యం ఆలయాల పరిరక్షణ, అభివృద్ధి, పునరుద్ధరణ. భక్తుల విశ్వాసాలను కాపాడటం మా బాధ్యత. వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేసే వారికి ప్రజలే తగిన సమాధానం చెబుతారు.




