Renigunta: మాటలు కాదు.. అభివృద్ధి చేసి చూపిస్తాం: సర్పంచ్ అభ్యర్థి జయలలిత!
Renigunta: పిఠాపురం తరహాలో రేణిగుంటను అభివృద్ధి చేస్తామని, బ్యాలెట్ సంఖ్య 2లో ఉన్న కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని జనసేన సర్పంచ్ అభ్యర్థి నగరం జయలలిత కోరారు.
Renigunta: మాటలు కాదు.. అభివృద్ధి చేసి చూపిస్తాం: సర్పంచ్ అభ్యర్థి జయలలిత!
Renigunta: గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా జనసేన పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నగరం జయలలితకు ఒక్క అవకాశం కల్పించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ మేరకు ఆదివారం రేణిగుంట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఎన్నికల గుర్తును ప్రకటించడంతో పాటు గ్రామ అభివృద్ధికి సంబంధించిన తమ కార్యాచరణ ప్రణాళికను వివరించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు కూటమి తరఫున తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు నగరం జయలలిత తెలిపారు. ఎన్నికల్లో తమకు కత్తెర గుర్తు కేటాయించగా, బ్యాలెట్‌లో వరుస సంఖ్య 2లో ఉన్న కత్తెర గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని రేణిగుంట ఓటర్లను అభ్యర్థించారు.
తన భర్త ల్యాబ్ భాస్కర్ గతంలో రెండుసార్లు వార్డు సభ్యుడిగా పనిచేసి ప్రజలకు సేవలందించారని, తాను కూడా మాజీ ఎంపీటీసీగా ప్రజా సమస్యలపై పనిచేసిన అనుభవం ఉందని జయలలిత పేర్కొన్నారు. గత 42 సంవత్సరాలుగా ల్యాబ్ భాస్కర్ పదవిలో ఉన్నా లేకపోయినా తనకున్న పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి ప్రజలకు అండగా నిలుస్తూ, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని వివరించారు.
రేణిగుంటలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ సహకారంతో గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.
తమకు ఒక్క అవకాశం కల్పిస్తే రేణిగుంటను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి, పిఠాపురం తరహాలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాల కంటే గ్రామ భవిష్యత్తు, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీలకు అతీతంగా ప్రజలంతా తనకు మద్దతుగా నిలవాలని జయలలిత విజ్ఞప్తి చేశారు. రేణిగుంటలో అభివృద్ధికి నూతన అధ్యాయం ప్రారంభించేందుకు వరుస సంఖ్య 2లోని కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని నగరం జయలలిత కోరారు.




