VC Sajjanar: ప్రాణం కంటే ఆ ఫోన్ కాల్ ముఖ్యమా?: దారుణమైన యాక్సిడెంట్ వీడియో షేర్ చేస్తూ సజ్జనార్ ఎమోషనల్ కామెంట్స్!
VC Sajjanar: హైదరాబాద్ బొల్లారంలో ఇయర్‌ఫోన్ పెట్టుకుని రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై సజ్జనార్ భావోద్వేగ పోస్ట్. ప్రాణం కంటే ఫోన్ కాల్ ముఖ్యమా అంటూ ప్రశ్నించారు.
VC Sajjanar: ప్రాణం కంటే ఆ ఫోన్ కాల్ ముఖ్యమా?: దారుణమైన యాక్సిడెంట్ వీడియో షేర్ చేస్తూ సజ్జనార్ ఎమోషనల్ కామెంట్స్!
VC Sajjanar: చెవుల్లో ఇయర్‌ఫోన్లు పెట్టుకుని బాహ్య ప్రపంచాన్ని మరచిపోతూ ప్రమాదాల బారిన పడుతున్న యువత తీరుపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని బొల్లారం సమీపంలో ఇయర్‌ఫోన్ పెట్టుకుని రైల్వే ట్రాక్‌పై నడుస్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ సందర్భంగా ప్రజలను, ముఖ్యంగా యువతను ఉద్దేశించి సజ్జనార్ ఒక సుదీర్ఘమైన, ఎమోషనల్ అప్పీల్ చేశారు. "ఆధునికత పేరుతో చెవులకు తగిలించుకుంటున్న ఇయర్ ఫోన్లు వినోదాన్ని పంచుతున్నాయా? లేక కళ్లముందే పొంచి ఉన్న మృత్యు కేకను కూడా వినిపించకుండా ప్రాణాల్ని కబళించే మాయా తెరగా మారుతున్నాయా?" అని ప్రశ్నించారు.
భీకరమైన శబ్దంతో రైలు దూసుకొస్తున్నా, హారన్ మోగుతున్నా గ్రహించలేనంతగా పరధ్యానంలో మునిగిపోవడం తీవ్ర విషాదాలకు దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కేవలం రైల్వే ట్రాక్‌ల వద్దే కాకుండా, రోడ్లపై బైక్‌లు, కార్లు డ్రైవ్ చేస్తూ ఇయర్‌ఫోన్లు వాడటం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాల హారన్లు, అత్యవసర అంబులెన్స్ సైరన్లు కూడా వినబడక తోటి వాహనదారుల ప్రాణాలకూ ముప్పు తెస్తున్నారని స్పష్టం చేశారు.
"సృష్టిలో ప్రాణానికి మించిన అత్యవసరమైన ఫోన్ కాల్ ఏదీ ఉండదు. జీవితాన్ని మించిన వినోదమూ లేదు. ఆ క్షణిక నిర్లక్ష్యానికి ఒక్కసారి ప్రాణం పోతే తిరిగి ఏ శక్తీ తీసుకురాలేదు. మీ కుటుంబానికి మిగిలేది తీరని శోకమే" అని హెచ్చరించారు.
రోడ్లు, రైల్వే ట్రాక్‌లు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన ప్రదేశాలని, అలసత్వానికి తావిచ్చే వేదికలు కాదని.. యువత తక్షణమే ఈ ప్రాణాంతక అలవాటును మానుకోవాలని, ఇళ్లల్లో వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులను గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.




