Tummidihetti Barrage: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై మహారాష్ట్ర బిగ్ గ్రీన్ సిగ్నల్.. రేవంత్-ఫడణవీస్ చర్చలు సఫలం!
Tummidihetti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచే అంశంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు సఫలమయ్యాయి. ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు నిర్ణయం.
Tummidihetti Barrage: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై మహారాష్ట్ర బిగ్ గ్రీన్ సిగ్నల్.. రేవంత్-ఫడణవీస్ చర్చలు సఫలం!
Tummidihetti Barrage: తెలంగాణ నీటి అవసరాలను తీర్చే అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ముంబయిలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం సమావేశమైంది. ఈ భేటీలో 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య కీలక చర్చలు జరిగాయి.
సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించారు. 2016లో కుదిరిన ఒప్పందం ప్రకారం 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే తెలంగాణ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని తెలిపారు.
152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటిని తరలించే వీలుంటుందని చెప్పారు. ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు అక్కడి భూసేకరణ నిబంధనల ప్రకారమే పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుబంధాన్ని గుర్తుచేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. వెనుకబడిన అటవీ ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు, ఆదివాసీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మాణానికి సహకరించాలని ఫడణవీస్‌ను కోరారు.
తెలంగాణ ప్రతిపాదనలపై మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్రపై ప్రతికూల ప్రభావం (ముంపు) లేకపోతే పాత ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కేంద్ర జలసంఘం (CWC) అధ్యయనంతో పాటు రెండు రాష్ట్రాల అధికారులతో కూడిన ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించాలని ప్రతిపాదించారు.
మహారాష్ట్ర సీఎంతో చర్చలు సఫలమైనట్లు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో వెల్లడించారు. తెలంగాణ విజ్ఞప్తిని పెద్ద మనసుతో పరిశీలించిన దేవేంద్ర ఫడణవీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యయనానికి కమిటీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని పేర్కొన్నారు.




