Hyderabad: బాచుపల్లిలో ఘోర విషాదం.. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి!
Hyderabad: హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని దినేశ్ హారిక్ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు యువ కార్మికులు మృతి చెందారు.
Hyderabad: బాచుపల్లిలో ఘోర విషాదం.. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి!
Hyderabad: నగరంలోని బాచుపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు దిగిన ముగ్గురు కార్మికులు విషవాయువులు పీల్చి, ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దినేశ్ హారిక్ అపార్ట్‌మెంట్‌లో ఈ దారుణ ఘటన జరిగింది.
అపార్ట్‌మెంట్‌లోని సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు ‘హెచ్ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్’ కంపెనీకి చెందిన కార్మికులు అక్కడికి వచ్చారు. ట్యాంకులో దిగిన కార్మికులు అందులోని విషవాయువుల కారణంగా ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులను సుమన్(24), సురేష్(25), పవన్(25) పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండానే కార్మికులను ట్యాంకులోకి దించారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ నిర్వాహకులు, క్లీనింగ్ ఏజెన్సీ బాధ్యుల నిర్లక్ష్యంపై ఆరా తీస్తున్నారు. 25 ఏళ్లలోపు యువకులు ఇలా అకాల మరణం చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.




