Conductor Pravalika: మృత్యువుతో 10 రోజులు పోరాడి ఓడిన కండక్టర్ ప్రవళిక

Conductor Pravalika: చిల్లర విషయంలో ప్రయాణికురాలు తోసేయడంతో గాయపడ్డ ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళిక మృతి. మణుగూరు డిపో బంద్, ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటన.

Arun Chilukuri
Published on: 4 Nov 2026 10:41 AM IST
Conductor Pravalika
X

Conductor Pravalika: మృత్యువుతో 10 రోజులు పోరాడి ఓడిన కండక్టర్ ప్రవళిక

Conductor Pravalika: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన ఆర్టీసీ మహిళా కండక్టర్ దారుణ ఉదంతం తీవ్ర విషాదాంతమైంది. విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌ను ఓ ప్రయాణికురాలు బస్సులో నుంచి కిందకు నెట్టివేయడంతో తీవ్రంగా గాయపడిన మణుగూరు డిపో కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు.

గత నెల 25వ తేదీన అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద జరిగిన ఈ ఘటనలో, చిల్లర డబ్బులు ఇచ్చే విషయంలో మౌనిక అనే ప్రయాణికురాలు కండక్టర్ ప్రవళికతో గొడవపడి ఆమెను బస్సులో నుంచి బయటకు నెట్టివేసింది. ప్రమాదవశాత్తు ప్రవళిక బస్సు వెనుక చక్రాల కింద పడిపోవడంతో ఆమె రెండు కాళ్లు తీవ్రంగా నుజ్జునుజ్జయ్యాయి.

తీవ్రగాయాలపాలైన ప్రవళికను తొలుత భద్రాచలం ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. మృత్యువుతో పది రోజుల పాటు పోరాడిన ప్రవళిక ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించక మంగళవారం తుదిశ్వాస విడిచారు.

ఉద్యోగంలో చేరిన 10 నెలలకే, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి ఇలా దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో మణుగూరులో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. కండక్టర్ ప్రవళిక మృతికి సంతాపం తెలిపిన ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఆమె తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి ప్రకటించారు.

మరోవైపు విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగి మృతికి కారణమైన నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రవళిక కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం మణుగూరు డిపో బంద్‌కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగడంతో జిల్లావ్యాప్తంగా బస్సు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.