Telangana: BS-6 బస్సులలో i-ALERT టెక్నాలజీతో టీజీఎస్ ఆర్టీసీ రికార్డు
Telangana: BS-VI బస్సులలో i-ALERT వ్యవస్థతో టీజీఎస్ ఆర్టీసీ రికార్డు; రూ.36 కోట్ల డీజిల్ ఆదా, ఏపీఎస్ ఆర్టీసీ, కేఎస్ ఆర్టీసీ ఆసక్తి.
Telangana: BS-6 బస్సులలో i-ALERT టెక్నాలజీతో టీజీఎస్ ఆర్టీసీ రికార్డు
తెలంగాణ: ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సురక్షిత డ్రైవింగ్ మరియు డ్రైవింగ్ లో డీజిల్ పొదుపు పద్ధతులను ప్రోత్సహించడానికి టీజీఎస్ ఆర్టీసీ BS-VI (బిఎస్ -6) బస్సులలో i-ALERT వ్యవస్థను ప్రవేశపెటీ దేశంలోనే తొలి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రికార్డు సృష్టించి అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది.
ఈ టెక్నాలజీ సమర్థవంతమైన వినియోగం ద్వారా సంస్థ ఇప్పటివరకు సుమారు రూ. 36 కోట్ల విలువైన HSD (హై-స్పీడ్ డీజిల్) ఆయిల్‌ను ఆదా చేయగా, ప్రతి నెలా అంచనా ప్రకారం సుమారు రూ. 2 కోట్లు (ఖచ్చితంగా ₹2,00,00,156.85) ఆదా అవుతోంది. దీనివల్ల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గడంతో పాటు బస్సుల మొత్తం ఇంధన సామర్థ్యం మెరుగుపడింది.
డ్రైవింగ్ పర్యవేక్షణ & పనితీరు మెరుగు పరచడం...
i-ALERT వ్యవస్థ డ్రైవింగ్ విధానాలను నిరంతరం గమనిస్తూ డ్రైవర్ల పనితీరును అంచనా వేయడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా సరైన గేర్ ఎంపిక మరియు వినియోగం, నిర్దేశించిన Green Band RPM పరిధిలో డ్రైవింగ్ చేయడం, ఎకానమీ గేర్లను సమర్థవంతంగా వాడటం, అనవసర ఖాళీగా ఇంజిన్ నడవడం తగ్గించవచ్చు.,. అదేవిధంగా అతివేగం( ఓవర్ స్పీడ్ ), నిర్లక్ష్యంగా బ్రేక్ ల వాడకం మరియు ఇంధన పొదుపు డ్రైవింగ్ పద్ధతులను అలవర్చుకోవడం వంటి అంశాలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది.
i-ALERT పనితీరు నివేదికల ఆధారంగా ఒక్కొక్క డ్రైవర్ పనితీరును పరిశీలిస్తూ, క్రమం తప్పకుండా సమాచారం ఇస్తుంది. విధి నిర్వహణ అనంతరం డ్రైవర్ నైపుణ్యాన్ని అంచనావేసి డ్రైవర్ పనితీరుకు గ్రేడింగ్స్ కూడా ఇస్తుంది. అదేవిధంగా మార్గదర్శకాలు అందించడం ద్వారా శాస్త్రీయ, ఇంధన పొదుపు డ్రైవింగ్ పద్ధతులను అనుసరించేలా డ్రైవర్లను ప్రోత్సహిస్తున్నారు.
ఇంధనం మరియు CO_2 వ్యర్థాల తగ్గింపు గణాంకాలు
1,500 అశోక్ లేలాండ్ (AL), BS-VI బస్సులలో i-ALERT పరికరాలను అమర్చడం ద్వారా రోజుకు 6,603 లీటర్లు మరియు నెలకు 1,98,090 లీటర్ల HSD ఆయిల్ ఆదా అవుతోంది. ప్రతి లీటరు HSD ఆయిల్‌కు కార్బన్ ఉద్గారం సుమారు 2.56 కిలోలుగా అంచనా వేయగా, దీని ప్రకారం రోజుకు 16,904 కిలోలు (సుమారు 16.90 మెట్రిక్ టన్నులు), నెలకు (30 రోజులకు) 507.11 మెట్రిక్ టన్నులు, మరియు సంవత్సరానికి (365 రోజులకు) 6,169.84 మెట్రిక్ టన్నుల CO_2 వ్యర్థాలు తగ్గుతున్నాయి.
పర్యావరణ పరిరక్షణ & భవిష్యత్ లక్ష్యం
టెక్నాలజీ ఆధారిత డ్రైవింగ్ పద్ధతులు ఆర్థిక ప్రయోజనాలతో పాటు వాహన ఉద్గారాలను, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ చొరవ నిరూపిస్తోంది. ఇంధన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన ప్రజా రవాణా వ్యవస్థ పట్ల TGSRTC నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తూ, భవిష్యత్తులోనూ వనరులను కాపాడటానికి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి ఇలాంటి సాంకేతిక కార్యక్రమాలను సంస్థ కొనసాగిస్తోంది. ప్రయాణికులు, సిబ్బంది రక్షనే ధ్యేయంగా టీజీఎస్ ఆర్టీసీ దేశంలోనే మొదటిసారి ఈ టెక్నాలజీ వాడకానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా i-ALERT టెక్నాలజీ పనితీరు సమాచారం కావాలని ఏపీఎస్ ఆర్టీసీ, కేఎస్ ఆర్టీసీ అధికారులు టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులను కోరడం జరిగింది.
ఇంజనీరింగ్ అధికారులకు అభినందనలు : వీసీ & ఎండి డాక్టర్ అనిల్ కుమార్.
ఇంత మంచి సాంకేతికత I-ALERTను అడాప్ట్ చేసుకున్న టీజీఎస్ ఆర్టీసీ ఇంజనీరింగ్ విభాగాన్ని సంస్థ వీసీ & ఎండీ డాక్టర్ అనిల్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే సంస్థ ధ్యేయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఇతర విభాగాలు కూడా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, సంస్థ సేవలను మరింత మెరుగుపరచాలని ఎండి అనిల్ కుమార్ సూచించారు.




