TGSRTC Sabarimala: గురుస్వాములకు ఉచిత ప్రయాణం, క్యాష్ కమిషన్.. శబరిమల యాత్రికులకు టీజీఎస్ఆర్‌టీసీ బంపరాఫర్!

TGSRTC Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు టీజీఎస్ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు. గురుస్వాములకు ఉచిత ప్రయాణం, కమిషన్ మరియు కేరళ బోర్డర్ టాక్స్ మినహాయింపు వివరాలు.

Arun Chilukuri
Published on: 5 Nov 2026 11:29 AM IST
TGSRTC Sabarimala
X

TGSRTC Sabarimala: గురుస్వాములకు ఉచిత ప్రయాణం, క్యాష్ కమిషన్.. శబరిమల యాత్రికులకు టీజీఎస్ఆర్‌టీసీ బంపరాఫర్!

TGSRTC Sabarimala Special Buses: శబరిమల అయ్యప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ రాష్ట్ర భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అత్యంత తీపి కబురు అందించింది. అయ్యప్ప భక్తుల శబరిమల యాత్ర సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ప్రణాళికతో బస్సులను సిద్ధం చేశారు. శబరిమల పూజా సమయాలు మరియు దర్శన వేళలకు అనుగుణంగా మొత్తం రెండు విడతల్లో ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ నడపనుంది.

తొలి విడతగా మండల పూజ కాలం కోసం నవంబరు 16వ తేదీ నుంచి డిసెంబరు 27వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత మకరవిలక్కు, మకరజ్యోతి మహోత్సవాల కోసం డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు రెండో విడత సర్వీసులు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి.

బస్సుల బుకింగ్ నిర్వహించే గురుస్వాములను ప్రోత్సహించేందుకు టీజీఎస్ఆర్‌టీసీ ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. కాంట్రాక్ట్ క్యారేజ్ కింద ఒక బస్సు బుక్ చేసిన గురుస్వామికి ఆ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు. అలాగే ఒకరి కంటే ఎక్కువ బస్సులను బుక్ చేసే గురుస్వాములకు, ఒక బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు అదనంగా బుక్ చేసే ప్రతి బస్సుకు రోజుకు రూ.350 చొప్పున కమిషన్ ప్రోత్సాహకం చెల్లిస్తారు.

భక్తుల సౌకర్యార్థం ప్రతి కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులో ఇద్దరు వంట మనుషులు (కూక్స్), 10 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న ఇద్దరు మణికంఠ (బాల) భక్తులు మరియు ఒక లగేజీ అటెండెంట్‌కు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఇక ఈ ఏడాది భక్తులకు ఆర్థికంగా భారీ ఉపశమనం కలిగిస్తూ తెలంగాణ రవాణా సంస్థ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు పన్ను (బోర్డర్ టాక్స్) నుంచి పూర్తి మినహాయింపు మంజూరు చేసింది.

కేరళ ప్రభుత్వ నిర్ణయంతో భక్తులకు ప్రయాణ భారంతో పాటు ఆర్థికంగా ఎంతో ఊరట లభించనుంది. స్వామివారి దర్శన వేళలకు సరిపోలేలా రవాణా వేళలను పక్కాగా ప్రణాళిక చేశారు. ఈ బస్సుల ముందస్తు బుకింగ్స్, మరింత సమాచారం కోసం భక్తులు 040-66440000, 040-23450033 ఫోన్ నంబర్లలో ఆర్టీసీ అధికారులను సంప్రదించాలని సంస్థ ప్రతినిధులు కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.