TGSRTC: మహిళా కండక్టర్ మృతి.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తలుపులు అమర్చిన ఆర్టీసీ బస్సుల్లో డోర్లు పూర్తిగా మూసిన తర్వాతే వాహనాలను నడపాలని ఆదేశించింది.
Telangana RTC
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తలుపులు అమర్చిన ఆర్టీసీ బస్సుల్లో డోర్లు పూర్తిగా మూసిన తర్వాతే వాహనాలను నడపాలని ఆదేశించింది. బస్సు కదులుతున్న సమయంలో డోర్లు తెరిచి ఉంచకూడదని స్పష్టం చేసింది. ఇటీవల విధుల్లో ఉన్న మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక కదులుతున్న బస్సు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన తర్వాత ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు సంబంధించి ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం తాజాగా అధికారిక సర్క్యులర్ జారీ చేసింది.
మహిళా కండక్టర్ మృతితో మారిన రూల్స్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం సమీపంలో అక్టోబర్ 25న ఈ ఘటన జరిగింది. మణుగూరు డిపోకు చెందిన గుండ్ల ప్రవళిక పల్లె వెలుగు బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న సమయంలో ఓ మహిళా ప్రయాణికురాలితో టికెట్, చిల్లర డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆ ప్రయాణికురాలు ప్రవళికను కదులుతున్న బస్సు నుంచి కిందకు తోసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమె బస్సు వెనుక చక్రాల కింద పడటంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత భద్రాచలం ఆసుపత్రికి తరలించి, తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకొచ్చారు. దాదాపు పది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రవళిక నవంబర్ 3 రాత్రి చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటన తర్వాత ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.
డోర్లు ఉన్న బస్సులకు కొత్త రూల్
ఆర్టీసీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. అన్ని డిప్యూటీ రీజినల్ మేనేజర్లు తమ పరిధిలోని బస్సుల్లో ప్రయాణికుల తలుపుల పనితీరును పరిశీలించాలి. డోర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా? వాటిని సులభంగా తెరవడం, మూయడం సాధ్యమవుతోందా? అనే అంశాలను తనిఖీ చేయాలి. డోర్లు ఉన్న బస్సుల్లో అవి పూర్తిగా మూసిన తర్వాతే డ్రైవర్లు వాహనాలను ముందుకు నడపాలి. బస్సు ప్రయాణంలో ఉన్నంతసేపు తలుపులు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. డోర్లు సరిగా పనిచేయకపోతే వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించింది. ఈ నిబంధనలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
పల్లె వెలుగు నుంచి స్లీపర్ బస్సుల వరకు.. ఎవరికి వర్తిస్తుంది?
ఈ కొత్త నిబంధనలు తలుపులు అమర్చిన బస్సులన్నింటికీ వర్తిస్తాయి. ముఖ్యంగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి స్లీపర్ బస్సుల్లో డోర్లు మూసిన తర్వాతే ప్రయాణం కొనసాగించాలి. అయితే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి కొన్ని సర్వీసుల్లో ప్రయాణికుల కోసం ప్రత్యేక డోర్లు ఉండవు. అలాంటి బస్సులకు ఈ ప్రత్యేక డోర్ నిబంధన వర్తించదు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ దాదాపు 9,900 బస్సులతో ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. వీటిలో సంస్థకు చెందిన బస్సులతో పాటు అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి. అందుబాటులో ఉన్న డోర్లను సక్రమంగా నిర్వహించడం, ప్రయాణ సమయంలో వాటిని మూసి ఉంచడం ద్వారా ప్రమాదాల ముప్పును తగ్గించాలని యాజమాన్యం భావిస్తోంది.
నవంబర్ 7లోగా నివేదికలు ఇవ్వాలి
బస్సుల్లో డోర్ల పనితీరు, కొత్త నిబంధనల అమలుపై సమగ్ర నివేదికలు పంపాలని ఆర్టీసీ ఆదేశించింది. నవంబర్ 7, 2026లోగా ఈ నివేదికలను మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి అందించాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్లకు సూచించింది. రీజినల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, డిపో గ్యారేజ్ ఇన్ఛార్జీలకు కూడా ఈ ఆదేశాలు చేరాయి. తమ పరిధిలోని ప్రతి డోర్ బస్సును తనిఖీ చేసి, లోపాలుంటే సరిచేయించి, నిబంధనలు అమలవుతున్నట్లు నిర్ధారించుకోవాలి. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కూడా ఈ రూల్ అమలయ్యేలా చూడాలని యాజమాన్యం స్పష్టం చేసింది. మొత్తంగా ప్రవళిక ఘటన తర్వాత ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం బస్సు ప్రయాణాల్లో భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.




