Special Buses: దసరాకు ఊరెళ్లే వాళ్లకు బిగ్ రిలీఫ్.. ఆర్టీసీ 7 వేల స్పెషల్ బస్సులు రెడీ

Special Buses: దసరా పండుగ వేళ తెలంగాణ ఆర్టీసీ 7 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. స్పెషల్ బస్సులలో మాత్రమే 1.5 రెట్లు సవరించిన చార్జీలు వర్తిస్తాయి.

CR Reddy
Published on: 8 Oct 2026 6:49 AM IST
Special Buses
X

Special Buses 

Special Buses: దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని తట్టుకునేందుకు ఏకంగా 7,000 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా జోన్ల వారీగా ప్రత్యేక షెడ్యూల్ సిద్ధం చేశారు.

రీజియన్ల వారీగా బస్సుల కేటాయింపు

కరీంనగర్ జోన్ నుంచి అత్యధికంగా 3,533 బస్సులు నడపనున్నారు. ఇందులో ఆదిలాబాద్ 431, నిజామాబాద్ 719, కరీంనగర్ 1175, వరంగల్ 530, ఖమ్మం 678 బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ జోన్ నుంచి మహబూబ్ నగర్ 645, మెదక్ 255, నల్గొండ 815, రంగారెడ్డి 440 కలిపి మొత్తం 2,155 బస్సులు నడుస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి మరో 1,312 ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. అక్టోబర్ 9, 10, 16, 17 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ పక్కా ప్లాన్ రూపొందించింది.

బస్టాండ్లలో తాగునీరు, తాత్కాలిక షెడ్లు

హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. ప్రయాణికులు వేచి ఉండే ప్రదేశాల్లో షామియానాలు, కుర్చీలు, తాగునీరు, మైక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. తిరుగు ప్రయాణ రద్దీ కోసం అక్టోబర్ 25, 26 తేదీల్లో కూడా తగినన్ని బస్సులను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.

స్పెషల్ బస్సుల చార్జీల్లో మార్పులు

ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం పండుగ రోజుల్లో నడిచే ప్రత్యేక బస్సుల్లో మాత్రమే టికెట్ ధరలను 1.5 రెట్ల వరకు సవరించే వెసులుబాటు ఉంది. ఖాళీగా తిరిగే బస్సుల నిర్వహణ, డీజిల్ ఖర్చుల నిమిత్తం ఈ చార్జీల సవరణ వర్తిస్తుంది. కేవలం అక్టోబర్ 9, 10, 16, 17 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఉండే 25, 26 తేదీల్లో మాత్రమే ఈ సవరించిన ధరలు ఉంటాయి. సాధారణ బస్సుల్లో ఎప్పటిలాగే పాత చార్జీలే కొనసాగుతాయి.

మహిళలకు ఉచిత ప్రయాణం యథాతథం

మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కొనసాగుతుందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి స్పష్టం చేశారు. రెగ్యులర్ బస్సులతో పాటు స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు. సందేహాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.