Erravalli Lands: కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై సర్కార్ నజర్ - రంగంలోకి దిగిన రెవెన్యూ యంత్రాంగం

Erravalli Lands: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల వ్యవహారం అత్యంత హాట్ టాపిక్‌గా మారింది.

CR Reddy
Published on: 18 Sept 2026 8:28 AM IST
Erravalli Lands
X

Erravalli Lands

Erravalli Lands: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల వ్యవహారం అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ఎర్రవల్లి మరియు దాని శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందనే ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ అయింది. నెల రోజుల్లోగా దీనికి సంబంధించి పూర్తి లెక్కలు తేల్చాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మర్కుక్ తహశీల్దార్ కార్యాలయంలో పాత రికార్డులను తిరగేస్తూ, సర్వే నంబర్ 325 పరిధిలోని సుమారు 385 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు.

పాత శాటిలైట్ చిత్రాల పరిశీలన

కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, వాస్తవ పరిస్థితులను అంచనా వేయడానికి అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. గూగుల్ ఎర్త్ (Google Earth) పాత శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తూ.. గతంలో ఈ భూములు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా మారాయి, మధ్యలో ఏమైనా మార్పులు లేదా ఆక్రమణలు జరిగాయా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ భూమి ఎంత, పట్టా భూమి ఎంత, అది ఎవరి ఆధీనంలో ఉందనే విషయాలపై క్షేత్రస్థాయిలో సర్వే కొనసాగుతోంది. గురువారం సుమారు రెండు గంటల పాటు సరిహద్దు గ్రామాల్లో సర్వే నిర్వహించిన అధికారులు, శుక్రవారం కూడా దీన్ని కొనసాగించేందుకు ఏర్పాట్లు చేశారు.

స్థానిక రైతుల ఆందోళన

మరోవైపు అధికారుల అకస్మాత్తు క్షేత్రస్థాయి సర్వేతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ భూములను తామే సాగు చేసుకుంటున్నామని, ఎస్సీలమైన తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడం ఏంటని రైతులు నిలదీస్తున్నారు. ఈ భూమి ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉంది? రైతుల సాగులో ఉందా లేక ఇతరుల అధీనంలో ఉందా అనే సందిగ్ధత నెలకొంది. మరోవైపు సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బస్సుయాత్ర చేపట్టి రెవెన్యూ రికార్డులను పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. ఆక్రమించిన భూములన్నింటినీ వెనక్కి లాగి పేదలకు పంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.