Parents Welfare Act: అమ్మానాన్నలను పట్టించుకోకపోతే జీతంలో కోత.. అమలుకు కొత్త చట్టం

తెలంగాణలో వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత విధించే కొత్త చట్టం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉద్యోగి వేతనంలో 15 శాతం లేదా గరిష్ఠంగా రూ.10 వేల వరకు తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయనున్నారు.

CR Reddy
Published on: 12 Nov 2026 7:48 AM IST
Parents Welfare Act
X

Parents Welfare Act

Parents Welfare Act: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఇకపై తల్లిదండ్రుల బాధ్యతను విస్మరిస్తే వారి నెలవారీ జీతంలో కొంత మొత్తం కోత పడనుంది. ఆ డబ్బును నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యోగి జీతంలో 15 శాతం లేదా గరిష్ఠంగా రూ.10 వేలలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించనున్నారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను వయోవృద్ధుల సంక్షేమశాఖ రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపించింది.

ఏంటి ఈ కొత్త చట్టం?

తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల సహాయ పర్యవేక్షణ చట్టం-2026’కు ఇప్పటికే ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కుమారులు, కుమార్తెలు లేదా దత్తత తీసుకున్న సంతానం తమ వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఈ చట్టం కింద ఫిర్యాదు చేయవచ్చు. ఉద్యోగి నెలవారీ వేతనంలో 15 శాతం లేదా రూ.10 వేలలో ఏది తక్కువైతే అంత మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించేలా నిబంధనలు రూపొందించారు. చట్టం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను వయోవృద్ధుల సంక్షేమశాఖ సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆమోదం తర్వాత ఈ ప్రక్రియ ముందుకు సాగనుంది.

ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఏ ఆధారాలు చూపించాలి?

తల్లిదండ్రులు తమ పిల్లలు ఆర్థికంగా ఆదుకోవడం లేదని భావిస్తే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక అథారిటీని ఆశ్రయించవచ్చు. ఆన్‌లైన్ లేదా నేరుగా కార్యాలయంలో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అయితే తమ జీవనానికి సరిపడా ఆదాయం లేదని తల్లిదండ్రులు నిరూపించాలి. తమకు ఇతర మార్గాల ద్వారా నెలకు ఎంత ఆదాయం వస్తోంది? ఉద్యోగులైన పిల్లలు ఇప్పటివరకు ఎంత ఆర్థిక సహాయం అందించారు? వంటి వివరాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద ఇప్పటికే హైదరాబాద్ నుంచి మూడు, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందినట్లు సమాచారం.

ఫిర్యాదు అందిన తర్వాత ఏం జరుగుతుంది?

తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత జిల్లా అథారిటీ దరఖాస్తును పరిశీలించి రసీదు జారీ చేస్తుంది. వివరాలు, ఆధార పత్రాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన పది రోజుల్లో సంబంధిత ఉద్యోగికి నోటీసులు పంపిస్తుంది. తల్లిదండ్రులు సమర్పించిన ఫిర్యాదు, ఆధారాల ప్రతులను కూడా ఉద్యోగికి అందజేస్తారు. అనంతరం ఉద్యోగిని విచారణకు పిలిచి వివరణ తీసుకుంటారు. నిర్ణీత గడువులోగా స్పందించకపోయినా, విచారణకు హాజరుకాకపోయినా తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించేలా అథారిటీ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. అయితే విచారణకు తల్లిదండ్రులు కూడా హాజరు కావాలి. మొదటిసారి రాకపోతే మరోసారి నోటీసు ఇస్తారు. రెండోసారి కూడా హాజరుకాకపోతే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంటుంది. సరైన కారణాలు చూపితే మళ్లీ విచారణ చేపట్టవచ్చు.

జీతంలో ఎంత కోత పడుతుంది?

విచారణ పూర్తయ్యాక అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను సంబంధిత ప్రభుత్వ శాఖలు 60 రోజుల్లోగా అమలు చేయాలి. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఉద్యోగి నెలవారీ జీతంలో 15 శాతం లేదా రూ.10 వేలలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ప్రతి నెలా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఉదాహరణకు ఉద్యోగి నెల జీతం రూ.50 వేలు ఉంటే 15 శాతం అంటే రూ.7,500 అవుతుంది. అదే రూ.లక్ష జీతం ఉంటే 15 శాతం రూ.15 వేలు అవుతుంది. అయితే గరిష్ఠ పరిమితి రూ.10 వేలు కావడంతో ఆ మొత్తమే వర్తిస్తుంది.

ఇద్దరు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులైతే?

వృద్ధ తల్లిదండ్రులకు ఒకరి కంటే ఎక్కువ మంది సంతానం ఉండి, వారిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతే ఆ విషయాన్ని అథారిటీకి తెలియజేయాలి. అప్పుడు ఇద్దరికీ నోటీసులు జారీ చేసి, నిర్ణయించిన ఆర్థిక సాయాన్ని చెరిసగం భరించేలా ఆదేశాలు ఇవ్వవచ్చు. ఈ విధంగా తల్లిదండ్రుల బాధ్యతను ఒక్కరిపైనే వేయకుండా ఉద్యోగులైన పిల్లల మధ్య పంచే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరు మరణిస్తే, సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేసుకున్న పక్షంలో బతికున్న తల్లిదండ్రికి ఆర్థిక సాయం కొనసాగుతుంది.

కలెక్టర్ నిర్ణయంపై అప్పీల్ చేసుకోవచ్చా?

ఈ చట్టం అమలులో జిల్లా అథారిటీలు, రాష్ట్ర కమిషన్‌కు సివిల్ కోర్టుల తరహా అధికారాలు కల్పించారు. జిల్లా అథారిటీ 60 రోజుల్లోగా ఫిర్యాదును పరిష్కరించకపోతే తల్లిదండ్రులు రాష్ట్ర కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. అప్పీల్ అందిన 60 రోజుల్లో కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. జిల్లా అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులపైనా రాష్ట్ర కమిషన్‌లో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అథారిటీ, కమిషన్ ఆదేశాలను సంబంధిత ప్రభుత్వ శాఖలు, యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలి. ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానాలు విధించే అవకాశం ఉంది.

ఫిర్యాదును వెనక్కి తీసుకునే అవకాశం కూడా..

తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి సహాయం అందుతున్నట్లు భావిస్తే, ఉత్తర్వులు అమలవుతున్న సమయంలోనూ ఎప్పుడైనా ఫిర్యాదును వెనక్కి తీసుకోవచ్చు. అలాగే ఈ తరహా కేసుల పురోగతిని ప్రతి ఆరు నెలలకోసారి వయోవృద్ధుల కమిషన్ చీఫ్ కమిషనర్ ఆధ్వర్యంలోని కమిటీ సమీక్షించనుంది. మొత్తంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఆర్థిక బాధ్యత విధించడంతోపాటు, అవసరమైన వారికి న్యాయం జరిగేలా ఈ చట్టం ఉపయోగపడనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.