Land Resurvey: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.. రీసర్వే నిబంధనల్లో భారీ మార్పులకు సర్కార్ సిద్ధం
తెలంగాణలో సమగ్ర భూ రీసర్వేకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎస్వోపీలో మార్పులు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు.
Telangana Land Survey
Land Resurvey: తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వే ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో సర్వే సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులు, స్థానిక భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP)లో అవసరమైన మార్పులు చేయాలని నిశ్చయించింది. బుధవారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఆచరణాత్మక పరిష్కారాలతో కూడిన సరికొత్త మార్గదర్శకాలను త్వరలోనే రూపొందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రతి 15 రోజులకు గ్రామాల్లో చాటింపు
భూముల కొలతల విషయంలో రైతులు, భూ యజమానులకు ఎలాంటి అపోహలు, సందేహాలు తలెత్తకుండా అధికారులు పక్కాగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. సర్వే పూర్తయిన తర్వాత హద్దుల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై ముందుగానే అవగాహన కల్పించాలని సూచించారు. నోటీసులు జారీ చేసిన తర్వాత సంబంధిత గ్రామాల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా చాటింపు వేయించాలని పేర్కొన్నారు. దీనివల్ల విదేశాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్న భూ యజమానులకు కూడా తమ భూమి సర్వే సమాచారం సకాలంలో అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
22ఏ భూముల సమస్యలపై దృష్టి
రెవెన్యూ, అటవీ శాఖల భూముల సరిహద్దుల గుర్తింపులో ఎలాంటి గందరగోళం లేకుండా రెండు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. నిషేధిత జాబితాలోని 22ఏ భూముల సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. రీసర్వే పనుల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న నల్గొండ, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను అభినందించిన మంత్రి, నిజామాబాద్ జిల్లాలో సర్వే నత్తనడకన సాగడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పనితీరును మెరుగుపరుచుకుని లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.
సర్వే వేగవంతం చేసేందుకు రంగంలోకి మరో 400 రోవర్లు
రాష్ట్రవ్యాప్తంగా భూ రీసర్వే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక వనరులను భారీగా పెంచుతోంది. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలోని 141 రెవెన్యూ గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా సమగ్ర సర్వే చురుగ్గా సాగుతోంది. రాష్ట్రంలోని ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలతో పాటు రెండు రోవర్ యంత్రాలను కేటాయించారు. ప్రస్తుతం 708 రోవర్లతో కొలతలు జరుగుతుండగా, మరో వారం రోజుల్లో అదనంగా 400 రోవర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి ప్రకటించారు. తద్వారా హద్దుల నిర్ధారణ మరింత కచ్చితంగా, వేగంగా పూర్తి కానుంది.
ఐదు జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి భూముల గుర్తింపు
మరోవైపు రాష్ట్రంలో పేదల సొంతింటి కలను నెరవేర్చే గృహ నిర్మాణ పథకాలపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో వివిధ దశల్లో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే కేటాయించాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూములను తక్షణమే గుర్తించి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.




