విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లపై నిషేధం.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Film Promotions: విద్యాసంస్థల ప్రాంగణాల్లో సినిమా ప్రచారాలు, వాణిజ్య కార్యకలాపాలపై నిషేధం విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లపై నిషేధం.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Film Promotions: విద్యార్థుల భద్రతను పెంపొందించడం, విద్యాసంస్థలను ప్రైవేట్ మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకుండా అరికట్టడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లు, కళాశాలల ప్రాంగణాల్లో సినిమా ప్రచారాలు (Film Promotions), ఇతర వాణిజ్య కార్యకలాపాలపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని సర్కార్ డిసైడ్ అయ్యింది.
ఇటీవలి కాలంలో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాబోధనను పక్కనబెట్టి, విద్యార్థులను తమ రాజకీయ, కుటుంబ మరియు వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయనే విమర్శలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా కళాశాలల్లో సినిమా ప్రమోషన్లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాయి. తొలుత ఒకటి రెండు సంస్థల్లో ప్రారంభమైన ఈ విష సంస్కృతి క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఫిల్మ్ ప్రమోషన్లు, సెలబ్రిటీల ఈవెంట్ల సందర్భంగా ప్రాంగణాల్లో తోపులాటలు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుని కొన్నిసార్లు విద్యార్థులు ప్రాణాలు సైతం కోల్పోతున్న సందర్భాలు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యాసంస్థలు ఇటువంటి కార్యక్రమాల కోసం తరగతులను రద్దు చేసి సెలవులు ఇవ్వడంపై సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో విద్యాసంస్థల్లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలి, ఎలాంటి వాటిని నిషేధించాలనే అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది.
ప్రతిపాదిత చట్రం ప్రకారం.. విద్యాసంస్థల ప్రాంగణాలను కేవలం విద్య, క్రీడలు, నైపుణ్యాల పెంపు (Skill Development) కోసం మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్, ఏఐ ఇన్నోవేషన్ హబ్ వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రోత్సహిస్తోంది.
ఈ నేపథ్యంలో విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి తయారుచేసిన ముసాయిదా నివేదికను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తోంది. త్వరలోనే సినిమా ప్రమోషన్ల నిషేధానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.




