Free Sarees: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్
Free Sarees: తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్తను అందించింది.
Indiramma Sarees
Free Sarees: తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్తను అందించింది. ఇందిరమ్మ ఉచిత చీరల పంపిణీ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర పడటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చీరల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రూ.334 కోట్లతో 95 లక్షల మందికి ఉచితంగా పంపిణీ
రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకు నాణ్యమైన చీరలను అందించాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. దీనికోసం ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ఏకంగా రూ.334 కోట్లను కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల మంది మహిళలకు ఈ ఉచిత చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని సుమారు 163 కేంద్రాల్లో ఈ చీరల తయారీ వేగంగా సాగింది. ఇప్పటివరకు దాదాపు 65 లక్షల చీరల ఉత్పత్తి పూర్తయి అన్ని జిల్లాల కేంద్రాలకు సురక్షితంగా చేరాయి.
కొత్త డిజైన్లు, ఆకర్షణీయమైన రంగులు
గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన చీరల రంగులకు భిన్నంగా ఈసారి రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక మార్పులు చేసింది. గతంలో పాలపిట్ట రంగుతో కూడిన చీరలను అందించగా, ఈసరి కొత్తగా ఎరుపు రంగు జరీ అంచుతో కూడిన ఆకర్షణీయమైన చిలకపచ్చ రంగు చీరలను తయారు చేయించారు. మహిళలకు ఎంతో నచ్చే విధంగా సరికొత్త డిజైన్లతో ఈ చీరలను రూపొందించారు. గత రెండు నెలల క్రితమే తయారీ మొదలైనప్పటికీ, ఇందిరాగాంధీ జయంతి రోజే పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ తేదీని ఖరారు చేసింది. మిగిలిన చీరల తయారీ కూడా తుది దశకు చేరుకుంది.
ఆధార్ కార్డు తప్పనిసరి.. ప్రత్యేక యాప్‌తో పారదర్శకత
ఈ ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరిగేలా చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలు ఈ చీరలను పొందడానికి అర్హులు. పంపిణీ కేంద్రానికి వెళ్లే సమయంలో మహిళలు తమ వెంట ఆధార్ కార్డును కచ్చితంగా తీసుకెళ్లాలి. పంచాయతీ అధికారులు ఆధార్ వివరాలను ఆన్లైన్ యాప్‌లో నమోదు చేసుకుని ధృవీకరించిన తర్వాత చీరలను అందజేస్తారు. ఒకే వ్యక్తికి రెండుసార్లు చీరలు అందకుండా ఈ టెక్నాలజీ ద్వారా పక్కాగా నియంత్రణ చేస్తున్నారు.
వారం రోజుల్లోగా పంపిణీ
ఇందిరమ్మ చీరల పంపిణీ బాధ్యతలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు సెర్ఫ్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పగించింది. నవంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ పంపిణీ కార్యక్రమం వారం రోజుల పాటు నిరంతరంగా కొనసాగుతుంది. నిర్ణీత గడువులోగా అర్హులైన ప్రతి మహిళకు ఈ చీరలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా మహిళలు ఈ ఉచిత పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.




