Liquor Price Hike: మద్యం ప్రియులకు ఊహించని షాక్.. భారీగా పెరిగిన విదేశీ బ్రాండ్ల ధరలు
రాష్ట్రవ్యాప్తంగా విక్రయిస్తున్న పలు విదేశీ మద్యం బ్రాండ్ల ధరలను పెంచుతూ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) కీలక నిర్ణయం తీసుకుంది.
Liquor Price Hike
Liquor Price Hike: తెలంగాణలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా విక్రయిస్తున్న పలు విదేశీ మద్యం బ్రాండ్ల ధరలను పెంచుతూ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 352 విదేశీ మద్యం బ్రాండ్ల రేట్లు పెరుగుతున్నట్లు అధికారిక సర్క్యులర్ విడుదల చేసింది. సవరించిన కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేయడంతో కస్టమర్లపై అదనపు భారం పడనుంది.
6 శాతం వరకు పెరిగిన ధరలు
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న దాదాపు 352 విదేశీ మద్యం బ్రాండ్లపై సుమారు 6 శాతం వరకు ధరలు పెరిగాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మద్యంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించినప్పటికీ, రాష్ట్రంలో ధరలు పెరగడం గమనార్హం. దిగుమతి సుంకం తగ్గడం వల్ల రేట్లు తగ్గుతాయని ఆశించిన మందుబాబులకు ఈ కొత్త పెంపు తీవ్ర నిరాశ కలిగించింది. సవరించిన రుసుములు మద్యం దుకాణాలు, బార్లలో వెంటనే వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.
కొత్త బార్ల నోటిఫికేషన్‌కు పోటెత్తిన దరఖాస్తులు
మరోవైపు తెలంగాణ ఆబ్కారీ శాఖ కొత్తగా ఏర్పాటు చేయనున్న 41 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా భారీ స్పందన వచ్చింది. మొత్తం 41 బార్ల కోసం ఏకంగా 8,771 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో బార్‌కు సగటున 214 మంది పోటీ పడుతున్నారు. దరఖాస్తు రుసుముగా వెనక్కి ఇవ్వని రూ.లక్షను నిర్ణయించడంతో, కేవలం అప్లికేషన్ల ద్వారానే ప్రభుత్వ ఖజానాకు రూ.87.71 కోట్ల నిధులు సమకూరాయి.
క్యూఆర్ పరిధిలో భారీ పోటీ
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (క్యూఆర్) పరిధిలో పోటీ మరింత తీవ్రంగా ఉంది. అక్కడ కేటాయించిన 14 బార్లకు ఏకంగా 4,252 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ములుగులో ఒక బార్‌కు 376, అశ్వారావుపేటలో 357 చొప్పున అప్లికేషన్లు నమోదు కావడం విశేషం. ఈ నెల 12తో దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాగా, అక్టోబర్ 16న లాటరీ పద్ధతి ద్వారా అర్హులైన బార్ నిర్వాహకులను ఎంపిక చేయనున్నారు.
పాత బార్ల యజమానుల ఆందోళన
కొత్త బార్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం ఒకవైపు కనిపిస్తుండగా, ఇప్పటికే ఉన్న పాత బార్ల నిర్వహణ నష్టాల్లో సాగుతోందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనపు పన్నుల ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇటీవల బార్ల సంఘం ఆబ్కారీ భవన్ ఎదుట నిరసన కూడా తెలిపింది. ఉన్న వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని కొందరు చెబుతున్నా, కొత్త లైసెన్సుల కోసం ఇంత భారీగా పోటీ రావడం వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.




