Revanth Reddy: తెలంగాణలో కరువు ముప్పు.. ఏసీలు తగ్గించండి, వరి సాగు వద్దు!

Revanth Reddy: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం, తీవ్రమవుతున్న కరువు పరిస్థితులు , విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

G Krishna
Published on: 23 Oct 2026 9:47 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: తెలంగాణలో కరువు ముప్పు.. ఏసీలు తగ్గించండి, వరి సాగు వద్దు!

Revanth Reddy: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం, తీవ్రమవుతున్న కరువు పరిస్థితులు , విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రస్తుత సంక్షష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించడం ఎంతో ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావానికి సంబంధించిన వాస్తవాలను దాచిపెట్టడం వల్ల సమస్య మరింత జటిలమవుతుందని ఆయన హెచ్చరించారు.

విద్యుత్ పొదుపు చర్యలు.. స్వీయ నియంత్రణే కీలకం

పగటిపూట అనవసరంగా లైట్లు వెలిగించవద్దని, అత్యవసరం అయితే తప్ప ఏసీల వినియోగాన్ని తగ్గించాలని సీఎం కోరారు. కేవలం ప్రజలకే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఖచ్చితంగా విద్యుత్ పొదుపు చర్యలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చారు.

సౌర విద్యుత్ (సోలార్ పవర్) వినియోగంపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో సంప్రదాయ విద్యుత్‌పై భారాన్ని తగ్గించేందుకు సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎవరికి వారే సొంత అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని వివరించారు. మిగులు విద్యుత్‌ను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. తన స్వగ్రామైన కొండారెడ్డిపల్లిలో ఇళ్లపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, మిగులు విద్యుత్ విక్రయం ద్వారా గ్రామస్థులకు ఆర్థికంగా లబ్ది చేకూరుతోందని ఉదాహరణగా పేర్కొన్నారు.

ఆరుతడి పంటల వైపు మళ్లాలని రైతన్నలకు విజ్ఞప్తి

రాబోయే ఎండాకాలంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు. నీరు, విద్యుత్‌ను అత్యంత పొదుపుగా వినియోగించడం ద్వారానే ఈ సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కోగలమని తెలిపారు. నీటి లభ్యత తగ్గితే కేవలం వ్యవసాయమే కాకుండా మూగజీవాలు, పశువుల మనుగడపై తీవ్ర ప్రభావం పడుతుందని గుర్తుచేశారు.

యాదాద్రి ప్లాంట్ నిర్మాణంపై బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపాటు

ఈ సందర్భంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం కమీషన్లు, దోపిడీ లక్ష్యంగానే ఆ ప్రాజెక్టును చేపట్టారని ఆరోపించారు. బొగ్గు గనులు అందుబాటులో ఉన్న ప్రాంతంలో కాకుండా యాదాద్రిలో పవర్ ప్లాంట్ నిర్మించడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్ణయాలు, నిధుల కేటాయింపులపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరువు, విద్యుత్ సవాళ్లను ప్రభుత్వం , ప్రజలు పరస్పర సమన్వయంతో తిప్పికొట్టాలని కోరారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.