Revanth Reddy: రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేలా కాంగ్రెస్ ప్లాన్

Revanth Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిపై సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్ ప్రత్యేకంగా చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Gagan kumar
Published on: 27 Nov 2026 9:33 AM IST
Revanth Reddy
X

Revanth Reddy: రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేలా కాంగ్రెస్ ప్లాన్

Congress: తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ప్రభుత్వ విధానాలు, పాలనపై ఆయన వరుసగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమైనట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం పార్టీ ఇన్‌చార్జి సందీప్‌ను ప్రత్యేకంగా కలిసిన రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు సమాచారం. అంతేకాకుండా, ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామంటూ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీని సైతం ఆయన ఇన్‌చార్జి దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చే మార్గాలపై సీఎం రేవంత్ రెడ్డితో ఇన్‌చార్జి సందీప్ చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మూడు పదవులను భర్తీ చేసే సమయంలో రాజగోపాల్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలపై సందీప్ ఆరా తీసినట్లు సమాచారం. అయితే, ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే పార్టీలోని ఇతర సీనియర్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిని సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ నాయకత్వం పలు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని యథావిధిగా కేబినెట్‌లో కొనసాగిస్తూ, తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి జాతీయ స్థాయిలో ఏఐసీసీ పదవి అప్పగించడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపవచ్చనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమైనట్లు సమాచారం.

ఒకవేళ పార్టీ ఇచ్చే సంస్థాగత పదవికి రాజగోపాల్ రెడ్డి అంగీకరించకపోతే, ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేబినెట్ హోదా కలిగిన చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవుల్లో ఏదో ఒకటి ఇచ్చే అవకాశాలపై చర్చ జరుగుతోంది. పైన పేర్కొన్న ప్రతిపాదనలకు కూడా ఆయన సమ్మతించకపోతే, అటు ఏఐసీసీ సెక్రెటరీ పదవితో పాటు ఇటు ప్రభుత్వంలో ఏదైనా కీలక పదవిని ఇచ్చే అంశంపైనా సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.