Cold Wave: తెలంగాణను వణికిస్తున్న చలి పులి.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Cold Wave: తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రతపై వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 10 Nov 2026 10:40 AM IST
Cold Wave
X

Cold Wave: తెలంగాణను వణికిస్తున్న చలి పులి.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Cold Wave: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న మూడు రోజుల పాటు చలి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని పేర్కొంటూ రాష్ట్రంలోని 29 జిల్లాలకు ‘పసుపు’ (Yellow Alert) రంగు హెచ్చరికలు జారీ చేసింది.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల, ఖమ్మం, సూర్యాపేట, జనగామ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల తీవ్రతకు పడిపోయే ప్రమాదముందని అధికారులు వెల్లడించారు.

దేశంలోని ఈశాన్య దిశ నుండి రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో వీస్తున్న చలి గాలుల వల్లే ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుతున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. దీనికి తోడు వేకువజాము నుండి ఉదయం వరకు పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించే అవకాశముంది. దృష్టి గోచరత (Visibility) తగ్గే అవకాశం ఉన్నందున వాహన డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, జనగామ జిల్లాల్లో 14.8 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో 14.7 నుంచి 15 డిగ్రీల మధ్య, 18 జిల్లాల్లో 15.1 నుంచి 19.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో 16.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.