Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. 22ఏ భూములు, ఉద్యోగుల డీఏపై నేడు కీలక నిర్ణయాలు
Cabinet Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.
Cabinet Meeting
Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మంత్రివర్గ సమావేశం నేడు సచివాలయంలో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల ఎదురుచూస్తున్న పెండింగ్ సమస్యలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. ముఖ్యంగా పరిపాలనాపరమైన నిర్ణయాలతో పాటు సామాన్యులను వేధించే దీర్ఘకాలిక సమస్యలకు ఈ భేటీలో పరిష్కారం లభించే అవకాశం ఉంది.
ఉద్యోగుల డీఏ, పీఆర్సీపై భారీ అంచనాలు
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ అంశాలు కేబినెట్ అజెండాలో ప్రధాన స్థానం సంపాదించుకున్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న రెండు డీఏల చెల్లింపునకు సంబంధించిన ఫైల్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల విడుదల, ఇతర ఉద్యోగ సంక్షేమ అంశాలపై చర్చించి అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఈ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
మెట్రో ఫేజ్-2, మూసీ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠకు తెర
హైదరాబాద్ మహానగర అభివృద్ధిని పరుగులు పెట్టించే లక్ష్యంతో మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అంశంపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఫేజ్-1 ఆర్థిక భారం, నిధుల సమీకరణపై ఇప్పటికే ఎస్బీఐ క్యాప్స్‌ను కన్సల్టెంట్‌గా నియమించగా, దీనికి సంబంధించిన నివేదికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులు, నిర్మాణ వ్యయం, కేంద్ర ప్రభుత్వ అనుమతులపై సమీక్ష జరగనుంది. మరోవైపు మూసీ రివర్ రివైటలైజేషన్ ప్రాజెక్టు తదుపరి దశ పనులు, అవసరమైన భూసేకరణపై కూడా కేబినెట్ దృష్టి సారించనుంది. రీజినల్ రింగ్ రోడ్ (RRR) నిర్మాణ పనులు, నిధుల సర్దుబాటుకు సంబంధించి కీలక మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.
22ఏ భూములు, సంక్షేమ పథకాల అమలు
ధరణి పోర్టల్ కారణంగా చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం 22ఏ నిషేధిత భూముల జాబితా సమస్యలపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించనుంది. ఈ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేసేందుకు నూతన విధివిధానాలను ఖరారు చేయనున్నారు. అటు యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభ తేదీ, విధివిధానాలపై స్పష్టత రానుంది. అలాగే ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియపై కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు లభ్యత, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించనున్నారు. మొత్తంగా ఈ కేబినెట్ భేటీ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.




