Telangana Cabinet: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు.. తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు
Telangana Cabinet: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
Telangana Cabinet
Telangana Cabinet: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే ఇందిరమ్మ చీరల పంపిణీకి కూడా ముహూర్తం ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు, కోర్టులకు కొత్త పోస్టులు, అగ్నిమాపక చట్టంలో మార్పులు సహా పలు అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలు సంక్షేమం నుంచి పరిపాలన వరకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ వేదిక నుంచే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నారు. ఇందుకోసం నవంబర్ 20 నుంచి 30 వరకు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు సేకరిస్తాయి. ఈ దరఖాస్తులను తహశీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్వీకరిస్తారు. మరోవైపు ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా నవంబర్ 19 నుంచే ప్రారంభం కానుంది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు దీపావళి కానుక
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పేరుతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్రంలో 2,25,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి కమిషన్ స్థానంలో రెండు ప్రత్యేక కమిషన్లు రానున్నాయి. ఒక్కో కమిషన్‌కు ఒక చైర్మన్‌తో పాటు ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇందుకోసం 2003 నాటి చట్టాన్ని రద్దు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అగ్నిమాపక చట్టంలో మార్పులు
రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు ఫైర్ సర్వీస్ చట్టంలో మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్, 1999కు సవరణలు చేసే ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. ఇళ్లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక శాఖ వేగంగా స్పందించేలా కొత్త నిబంధనలు తీసుకురానున్నారు. మరోవైపు భూ సర్వే, సరిహద్దులకు సంబంధించిన నోటీసులపై అప్పీల్ చేసుకునే గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించాలని నిర్ణయించింది. తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్, 1923లోని సెక్షన్ 12(ఏ)కు సవరణ చేయనున్నారు.
కోర్టులకు 136 పోస్టులు
రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటైన కాటారం, ఎల్కతుర్తి కోర్టులకు 56 పోస్టులు మంజూరు చేయనున్నారు. అలాగే సిద్దిపేట, చౌటుప్పల్, మహబూబాబాద్, వేములవాడలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులకు మరో 80 పోస్టులు కేటాయించనున్నారు. దీంతో మొత్తం 136 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది.
కొడంగల్‌లో రైతు సభ
నవంబర్ 7 నుంచి 9 వరకు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నవంబర్ 9న అక్కడ భారీ రైతు బహిరంగ సభ నిర్వహించనున్నారు. అలాగే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. వీటితో పాటు రెవెన్యూ శాఖ పరిధిలోని ఏడు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను వివిధ శాఖలకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.




