Auto Price Hike: ఆటో ప్రయాణికులకు షాక్.. ఛార్జీలు పెంచిన ప్రభుత్వం
Auto Price Hike: తెలంగాణలో ఆటోరిక్షా ప్రయాణికులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆటో ఛార్జీలను పెంచుతూ రవాణా శాఖ కొత్త టారిఫ్‌ను ఖరారు చేసింది.
Auto Price Hike: ఆటో ప్రయాణికులకు షాక్.. ఛార్జీలు పెంచిన ప్రభుత్వం
Auto Price Hike: తెలంగాణలో ఆటోరిక్షా ప్రయాణికులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆటో ఛార్జీలను పెంచుతూ రవాణా శాఖ కొత్త టారిఫ్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు G.O.Ms.No.46 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆటోలో ప్రయాణిస్తే కనీసం రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఛార్జీలకు అనుగుణంగా ఆటో మీటర్లను కూడా రీసెట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
తొలి 1.6 కిలోమీటర్లకు రూ.30
కొత్త టారిఫ్ ప్రకారం ఆటో ప్రయాణంలో తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30గా నిర్ణయించారు. 1.6 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ.14 చొప్పున ఛార్జీ వసూలు చేయాలి. దీంతో ప్రస్తుతం ఉన్న మీటర్ ఛార్జీల స్థానంలో కొత్త టారిఫ్ అమల్లోకి రానుంది. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ లేదా ఇతర కారణాలతో ఆటో ఆగాల్సి వస్తే వెయిటింగ్ ఛార్జీ కూడా వర్తిస్తుంది. ప్రతి నిమిషానికి 75 పైసల డిటెన్షన్ ఛార్జీ వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది.
రాత్రి వేళల్లో 1.5 రెట్లు ఛార్జీ
రాత్రి వేళల్లో ఆటోలో ప్రయాణించే వారికి అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ టారిఫ్‌కు 1.5 రెట్లు ఛార్జీ వసూలు చేయనున్నారు. అంటే ఈ సమయంలో ఆటో ప్రయాణానికి సాధారణ ఛార్జీ కంటే 50 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
లగేజీకి కూడా కొత్త నిబంధనలు
ప్రయాణికులతో పాటు తీసుకెళ్లే లగేజీకి సంబంధించి కూడా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బ్రీఫ్‌కేస్, హ్యాండ్‌బ్యాగ్ వంటి చిన్న లగేజీకి అదనపు ఛార్జీ ఉండదు. అయితే పెద్ద పరిమాణంలో ఉండే లగేజీకి నిర్ణయించిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఆటోలో గరిష్ఠంగా 100 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
మీటర్లను రీసెట్ చేయాల్సిందే
కొత్త ఛార్జీలు అమల్లోకి రావడంతో ఆటోల్లోని డిజిటల్ మీటర్లను కూడా కొత్త టారిఫ్‌కు అనుగుణంగా మార్చాలి. మీటర్ ప్రారంభించిన వెంటనే రూ.30 కనీస ఛార్జీ కనిపించేలా సెట్టింగ్ చేయాలి. 1.60 కిలోమీటర్లు పూర్తయ్యాక ప్రతి 1/10 కిలోమీటర్ అంటే ప్రతి 100 మీటర్లకు రూ.1.40 చొప్పున ఛార్జీ పెరిగేలా మీటర్‌ను రీసెట్ చేయాలని రవాణా శాఖ ఆదేశించింది.
మూడు నెలల్లో కొత్త మీటర్ సెట్టింగ్
కొత్త టారిఫ్‌కు అనుగుణంగా ఆటో మీటర్ల రీసెట్టింగ్ ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త ఛార్జీలు ప్రయాణికులకు స్పష్టంగా కనిపించేలా ప్రతి ఆటోలో రివైజ్డ్ టారిఫ్ వివరాలను చూపించే స్టిక్కర్ లేదా టారిఫ్ కార్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొత్త నిబంధనలతో ఆటో ఛార్జీల విషయంలో ప్రయాణికులకు స్పష్టత రావడంతో పాటు, మీటర్ ఆధారంగా ఛార్జీలు వసూలు చేసే విధానం మరింత పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.




