CM Revanth Reddy: కరోనా కంటే 'సూపర్ ఎల్నినో' ముప్పు తీవ్రం
CM Revanth Reddy: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహామ్మారి కంటే 'సూపర్ ఎల్నినో' తెచ్చిపెట్టే సంక్షోభం మరింత భయానకంగా మారనుందని ముఖ్యమంత్రి.
CM Revanth Reddy: కరోనా కంటే 'సూపర్ ఎల్నినో' ముప్పు తీవ్రం
CM Revanth Reddy: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహామ్మారి కంటే 'సూపర్ ఎల్నినో' తెచ్చిపెట్టే సంక్షోభం మరింత భయానకంగా మారనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 1950 తర్వాత ఎన్నోసార్లు ఎల్నినో వచ్చినప్పటికీ, ఈసారి అది అత్యంత ప్రమాదకరంగా మారుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని తెలిపారు. భూగోళంపై ఉన్న ప్రతి జీవరాశిపై దీని ప్రభావం పడుతోందని.. ఈ విపత్తు నుంచి రాష్ట్ర ప్రజలను, రైతాంగాన్ని, పశుసంపదను కాపాడుకునేందుకు ప్రభుత్వం అత్యవసర కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు.
అక్టోబర్లోనే మార్చి నాటి మంటలు.. అడుగంటిన కృష్ణా బేసిన్
సాధారణంగా మార్చి నెలలో నమోదు కావాల్సిన 38 డిగ్రీలకు పైగా తీవ్ర ఉష్ణోగ్రతలు అక్టోబర్ ప్రారంభంలోనే నమోదవుతుండటం రాబోయే ముప్పునకు నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 23 శాతం లోటు నమోదైందని, ముఖ్యంగా కృష్ణా బేసిన్లోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఏకంగా 70 శాతం పడిపోవడం అత్యంత శోచనీయమని అన్నారు. యాసంగి పంటల సమయానికి ముందే నీటి లభ్యతపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని, ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సాగుకే కాకుండా వేలాది గ్రామాలు, పట్టణాల తాగునీటి అవసరాలకు కూడా ఆచితూచి కేటాయించాల్సి వస్తోందని వివరించారు.
ఎన్నడూ లేనంతగా 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్!
రాష్ట్రంలో ఉన్న 30 లక్షల వ్యవసాయ పంప్సెట్ల కారణంగా కరెంట్ వాడకం రికార్డు స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి తెలిపారు. సాధారణంగా 15 వేల మెగావాట్లు సరిపోతుందని భావిస్తే, ఒక్కసారిగా డిమాండ్ 20 వేల మెగావాట్లకు పైగా పెరిగి తెలంగాణ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు. సరఫరా కంటే అవసరాలు విపరీతంగా పెరిగినప్పటికీ, రైతుల పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ను అందిస్తున్న డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో పాటు విద్యుత్ అధికారులను, సిబ్బందిని ఆయన ప్రత్యేకం అభినందించారు. ఎంత ఖర్చయినా సరే, మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు అందిస్తామని భరోసానిచ్చారు.
రైతులు మనోధైర్యం కోల్పోవద్దు.. కేంద్రం రూ. 20 వేల కోట్లు ఇవ్వాలి
కరువు పరిస్థితుల్లోనూ రక్తం ధారపోసి దేశానికి ఆహారాన్ని అందించిన అన్నదాతలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. రాబోయే జూలై వరకు ఉండే 8 నెలలు అత్యంత కీలకమని, నీరు , కరెంట్ను ప్రతీ ఒక్కరూ అత్యంత పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ తీవ్ర కరువు పరిస్థితులను అధిగమించడానికి, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడానికి తక్షణమే రూ. 20,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఈ ప్రకృతి విపత్తును ధీటుగా ఎదుర్కొంటామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.




