Siddipet: కోడితో పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్.. అసలేం జరిగిందంటే?
Siddipet: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది.
Siddipet: కోడితో పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్.. అసలేం జరిగిందంటే?
Siddipet: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ కోడిని ఢీకొట్టడమే కాకుండా.. అదేమని ప్రశ్నించిన కోడి యజమానితో డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహించిన బాధితుడు, చనిపోయిన కోడిని తీసుకుని ఏకంగా 8 కిలోమీటర్లు ప్రయాణించి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. స్థానికంగా ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆకునూరు గ్రామానికి చెందిన 63 ఏళ్ల పౌడాల రాములు తన ఇంటి వద్ద కోళ్లను పెంచుకుంటున్నారు. సోమవారం అదే ప్రాంతానికి చెందిన మల్లోజుల రవికుమార్ అనే వ్యక్తి కారులో అతివేగంగా వెళ్తూ.. రాములు ఇంటి ముందు ఉన్న కోడిని ఢీకొట్టాడు. కారు వేగానికి ఆ కోడి అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే తాను పెంచుకున్న కోడి ప్రాణాలు కోల్పోవడంతో రాములు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ‘‘కారు అంత వేగంగా, నిర్లక్ష్యంగా నడిపితే మనిషి ఎదురొచ్చినా ఇలాగే ఢీకొడతావా?’’ అంటూ డ్రైవర్‌ను ప్రశ్నించారు.
పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్పాల్సింది పోయి.. రవికుమార్ తనపై ఎదురుదాడికి దిగాడని రాములు ఆరోపిస్తున్నారు. తనను దుర్భాషలాడటమే కాకుండా.. ‘‘నువ్వేం చేసుకుంటావో చేసుకో’’ అంటూ బెదిరించాడని బాధితుడు వాపోయాడు.
డ్రైవర్ వ్యవహారశైలితో మనస్తాపానికి గురైన రాములు దంపతులు విషయాన్ని అంతటితో వదిలేయలేదు. చనిపోయిన కోడిని చేతబట్టుకుని 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేర్యాల పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఎస్సై అపూర్వ రెడ్డిని కలిసి జరిగిన విషయాన్ని వివరిస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కారుతో కోడిని చంపినందుకు ఒక బాధ అయితే, న్యాయం అడిగితే బెదిరించాడని.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాములు పోలీసులను కోరారు. మొత్తానికి ఒక కోడి మృతితో మొదలైన వివాదం పోలీస్ స్టేషన్ గడప తొక్కడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.




