RTO online services: ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలకు చెక్..ఇకపై ఆన్‌లైన్‌లోనే ఓనర్ షిప్ ట్రాన్స్‌ఫర్

RTO online services: తెలంగాణ రవాణా శాఖ వాహనదారులకు ఊరటనిచ్చింది.

Gagan kumar
Published on: 8 Nov 2026 10:00 AM IST
RTO online services
X

RTO online services: ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలకు చెక్..ఇకపై ఆన్‌లైన్‌లోనే ఓనర్ షిప్ ట్రాన్స్‌ఫర్

Vahan Citizen Portal Telangana: వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇకపై సేవలు, పనుల కోసం ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఏజెంట్ల ప్రమేయం లేకుండా నేరుగా ఇంటి వద్ద నుంచే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా 3 కీలక సేవలను ఆన్‌లైన్‌లో పొందే అత్యంత సులువైన వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. ‘వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్’ ద్వారా ఆధార్ ఓటీపీ ఆధారంగా డిజిటల్ పద్ధతిలో ఈ సేవలను పూర్తి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ఇంతకుముందు బండి కొన్నా, అమ్మినా ఇద్దరూ ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఈ క్రింది విధంగా ఆన్‌లైన్‌లో ప్రక్రియ పూర్తి చేయవచ్చు. పోర్టల్‌లో వాహనం నంబర్, చాసిస్/ఇంజిన్ నంబర్ చివరి 5 అంకెలు, ఇన్సూరెన్స్ లేదా పొల్యూషన్ వివరాలతో విక్రేత లాగిన్ అయి ఆధార్ ఓటీపీ ద్వారా ప్రాసెస్ ప్రారంభిస్తారు. కొనుగోలుదారు వివరాలు నమోదు చేయగానే ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ నంబర్ సాయంతో కొనుగోలుదారు లాగిన్ అయి, తన ఆధార్ ఓటీపీతో వివరాలు నమోదు చేస్తారు. వాహనంపై ఏమైనా నేర రికార్డులు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ద్వారా నేరుగా సిస్టమ్‌లోనే పరిశీలించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, ఇరువైపులా ఆధార్ e-Sign పూర్తి కాగానే అప్లికేషన్ ఆటోమేటిక్‌గా ఆమోదం పొందుతుంది. అనంతరం కొత్త ఆర్‌సీ జారీ అవుతుంది.

మీ వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లాలన్నా లేదా అక్కడ విక్రయించాలన్నా అవసరమయ్యే NOC ని కూడా పోర్టల్‌లోనే సులభంగా పొందవచ్చు. వాహన వివరాలు, ఆధార్ ఓటీపీ ద్వారా వివరాలు ధ్రువీకరించుకున్నాక NCRB రిపోర్టును డౌన్‌లోడ్ చేసుకోవాలి. నిర్ణీత ఫీజు చెల్లించి, ఫారమ్-28 తో పాటు సంబంధిత పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. దరఖాస్తు నేరుగా ఆర్టీఓ కార్యాలయానికి చేరుతుంది, మధ్యవర్తులు లేకపోయినా పనైపోతుంది.

వాహన రికార్డుల్లో యజమాని చిరునామా, ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఈ e-KYC సేవ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధార్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా వివరాలు సరిచూసుకోవాలి. ఆధార్ కాపీ, ఒరిజినల్ ఆర్‌సీని అప్‌లోడ్ చేసి అధికారుల ఆమోదం పొందవచ్చు. e-KYC లో వివరాలు ఒకసారి సబ్మిట్ చేశాక మార్పులు చేయడానికి కుదరదు. ఏవైనా తప్పులు దొర్లితే దరఖాస్తును ఉపసంహరించుకోవడంతో పాటు, చెల్లించిన ఫీజు కూడా జప్తు అవుతుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి. ఫోన్‌కు వచ్చే ఓటీపీ లభించే కాలపరిమితి 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. వీటిని ఎవరితోనూ పంచుకోవద్దు. రవాణా శాఖ అధికారిక వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్‌ను మాత్రమే వినియోగించండి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.