Revanth Reddy: రేవంత్ రెడ్డిని వదలని డీప్‌ఫేక్.. ఏం చేశారో తెలుసా..?
Revanth Reddy: బతుకమ్మ నుంచి రూ.2,500 , కళ్యాణలక్ష్మి కింద బంగారం ఇస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరుతో వైరల్ అవుతున్న వీడియో డీప్‌ఫేక్ అని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తేల్చింది.
Revanth Reddy: రేవంత్ రెడ్డిని వదలని డీప్‌ఫేక్.. ఏం చేశారో తెలుసా..?
Revanth Reddy: సామాజిక మాధ్యమాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఓ డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బతుకమ్మ పండుగ నుంచి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, కళ్యాణలక్ష్మి పథకం కింద రెండు తులాల బంగారం అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అంటూ సాగుతున్న ఆ వీడియోపై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తీవ్రంగా స్పందించింది. అది పూర్తిగా మార్ఫింగ్ చేసిన డీప్‌ఫేక్ వీడియో అని తేల్చిచెప్పింది.
వైరల్ అవుతున్న వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు నిజమైనవే. అయితే ఇవి ఏ పథకాల ప్రకటనా కాదు. 2025 ఏప్రిల్‌లో రవీంద్రభారతిలో నిర్వహించిన 892వ బసవ జయంతి వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడిన దృశ్యాలను కొందరు కావాలనే సేకరించారు. అసలు వీడియోలోని విజువల్స్‌ను తీసుకుని, వాటికి ఏఐ సాంకేతికత ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్ ఆడియోను జతచేశారు. ఏఐ డిక్టేషన్ పరికరాలతో పరిశీలించగా అది పూర్తిగా డీప్‌ఫేక్ ఆడియో అని నిర్ధారణ అయింది. ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా కొందరు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు.
ఈ వైరల్ వీడియోలో ప్రస్తావించిన అంశాలలో కొన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఉన్నవే అయినప్పటికీ, వాటి అమలు తేదీలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కుటుంబంలోని మహిళకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో ప్రకటించింది. అయితే దీని అమలుపై ప్రభుత్వం ఇంకా విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది. పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పథకం అమల్లో ఉంది. కానీ, బతుకమ్మ నుంచి రెండు తులాల బంగారం ఇస్తామని సీఎం ప్రకటించారు అన్నది మాత్రం పూర్తిగా అవాస్తవం.
సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఫేక్ వీడియోలను, వదంతులను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఫ్యాక్ట్ చెక్ బృందం స్పష్టం చేసింది. సంక్షేమ పథకాలు, కొత్త ప్రకటనలు, అర్హతలు లేదా తేదీలకు సంబంధించిన ఏ సమాచారమైనా సరే.. సోషల్ మీడియా పోస్టుల ద్వారా కాకుండా కేవలం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ప్రకటనల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని సూచించింది.




