Ramachandar Rao: నెహ్రూ కుటుంబం ప్రధాని కాలేదనే అక్కసుతోనే కాంగ్రెస్ ఆరోపణలు
Ramachandar Rao: నెహ్రూ కుటుంబం ప్రధాని కాలేదనే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మండిపడ్డారు.
Ramachandar Rao: నెహ్రూ కుటుంబం ప్రధాని కాలేదనే అక్కసుతోనే కాంగ్రెస్ ఆరోపణలు
Ramachandar Rao: నెహ్రూ కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రధాని కావడం లేదనే అక్కసుతోనే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అందుకే దేశంలో బీజేపీ అక్రమంగా గెలుస్తోందంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా ఎన్నికలు అక్రమంగా జరిగితే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చట్టవిరుద్ధంగానే గెలుపొందారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేరళ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలతోనూ రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగడుతూ.. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే మాత్రం ఈవీఎంలు మంచివి కాదంటూ విపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు.
గతంలో కేసీఆర్ కుటుంబం బాగుపడిందని, ఇప్పుడు రేవంత్ బ్రదర్స్ బాగుపడుతున్నారే తప్పితే తెలంగాణ ప్రజల జీవితాలు మాత్రం బాగుపడడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ, దిల్లీకి మాత్రం మూటలు పంపడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.




