Rahul Gandhi: గిగ్ వర్కర్లకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన!

Rahul Gandhi: హైదరాబాద్‌లోని జయభేరి గ్రౌండ్స్‌లో గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Arun Chilukuri
Published on: 14 Nov 2026 12:58 PM IST
Rahul Gandhi
X

Rahul Gandhi: గిగ్ వర్కర్లకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన!

Rahul Gandhi: తెలంగాణలోని గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జయభేరి గ్రౌండ్స్‌లో నిర్వహించిన గిగ్ వర్కర్ల భారీ సభకు హాజరైన వీరు, గిగ్ వర్కర్స్ విధివిధానాలను అధికారికంగా విడుదల చేశారు. గతంలో గిగ్ వర్కర్లకు ఇచ్చిన హామీని నేడు పూర్తి చేస్తున్నామని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు గిగ్ వర్కర్ల సమాచారానికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన వివరాలు లేవని, వారి శ్రమకు తగిన ప్రతిఫలం ఎంత లభిస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. నూతన చట్టం ద్వారా గిగ్ వర్కర్లు తమ సమాచార వివరాలను పొందవచ్చని, డెలివరీ, శ్రమ, ప్రతిఫలానికి సంబంధించిన అన్ని వివరాలు నేరుగా వారి ఫోన్‌లోనే వస్తాయని తెలిపారు. అలాగే, హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో గిగ్ వర్కర్ల కోసం వైఫై (WiFi) సౌకర్యంతో కూడిన విశ్రాంత భవనాలను నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.

గిగ్ వర్కర్లకు ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన ప్రయోజనాలు:

బీమా సౌకర్యం: గిగ్ వర్కర్లకు ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల ఆరోగ్య బీమా అందిస్తోంది.

డెలివరీలో 1 శాతం నగదు జమ: పింఛన్‌, సామాజిక భద్రత, పొదుపు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రతి డెలివరీలో ఒక శాతం (1%) నగదు గిగ్ వర్కర్ల బోర్డు ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని వెల్లడించారు.

గిగ్ వర్కర్ల శ్రమ, దాని ఫలితం కేవలం కంపెనీలకే దక్కేలా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎల్లప్పుడూ గిగ్ వర్కర్లకు పూర్తి అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.