Raja Singh: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.. కరువు, నీటి కష్టాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్!
Raja Singh: చెరువుల పూడికతీతను గాలికొదిలేయడం వల్లనే రాష్ట్రంలో నీటి కష్టాలు వచ్చాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Raja Singh: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.. కరువు, నీటి కష్టాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్!
Raja Singh: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా, తాగునీటి ఎద్దడి తలెత్తినా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడంలో విఫలమైందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా చెరువులను శుభ్రం చేయలేదని, కనీసం అందులో నుంచి కేజీ మట్టి కూడా తీయకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చాక, ప్రతి చుక్క నీటిని సేవ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే అందరూ అలర్ట్ అయ్యి మద్దతు తెలిపారని రాజాసింగ్ గుర్తుచేశారు. అయితే, ముందస్తుగా ఎలాంటి అంచనాలు వేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. "చెరువుల్లో కనీసం 10 అడుగుల మేర మట్టిని (పూడికతీత) తొలగిస్తే ఎంత భారీగా నీరు నిల్వ ఉండేది? ఆ ఆలోచన ఈ ప్రభుత్వానికి రాలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొంతవరకు చెరువులను క్లీన్ చేసింది. చెరువులను కాపాడితే వర్షాలు పడకపోయినా కొంత నీటిని సేవ్ చేసుకునే వాళ్లమని సీఎంకు కానీ, మంత్రులకు కానీ తట్టలేదు" అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సిటీ మొత్తం కాంక్రీట్ మయమైపోయిందని, ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూగర్భ జలాలు అడుగంటి, వర్షాలు పడక కరెంట్ కష్టాలు, నీటి కష్టాలు వస్తాయని తెలిసినా ప్రభుత్వం కేవలం రాజకీయం చేస్తోందని రాజాసింగ్ మండిపడ్డారు. ఇది రాజకీయం చేసే సమయం కాదని, అన్నదాతలను ఎలా ఆదుకోవాలి? సిటీ ప్రజలకు తాగునీటిని ఎలా సప్లై చేయాలి? అనే దానిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు నీటిని ఎలా రప్పించాలనే దానిపై తక్షణమే ఒక పకడ్బంది 'ప్లాన్ ఆఫ్ యాక్షన్' (Action Plan) సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




